వరంగల్ నగరంలో రేపు ట్రాఫిక్ మళ్లీంపు
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ఏప్రిల్ 15న బీజేపీ పార్టీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ ర్యాలీ సందర్భంగా వరంగల్, హనుమకొండ నగరాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లీంపు వుంటుందని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూధన్ ప్రకటించారు. ట్రాఫిక్ మళ్లీంపు కు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ శనివారం సాయంత్రం 4 గంటలకు కేయూసీ నుంచి ప్రారంభమై హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ వరకు కొనసాగుతుందని ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఈ ర్యాలీ దృష్ట్యా నగరంలో పలు ట్రాఫిక్ మళ్లీంపు ఆంక్షలు సాయంత్రం 3.00 గంటల నుండి 8.00గంటల విధించినట్లు పేర్కొన్నారు.
ట్రాఫిక్ మళ్లింపు వివరాలు ఇలా ఉన్నాయి..
1.కరీంనగర్ నుండి హనుమకొండ వరంగల్ వైపు వెళ్లే వాహనాలు కేయుసి క్రాస్ రోడ్డు నుండి, పెగడపల్లి డబ్బాలు, పెద్దమ్మ గడ్డ ములుగు రోడ్డు మీదుగా హనుమకొండ బస్టాండు, వరంగల్ కు చేరుకోవలెను మరియు కరీంనగర్ నుండి కాజీపేట వైపుకు వెళ్లే వాహనాలు కేయుసి క్రాస్ రోడ్డు నుండి సెయింట్ పీటర్స్ స్కూల్, అంబేద్కర్ భవన్, సుబేదారి గుండా కాజీపేటకు వెళ్ళవలెను.
2. వరంగల్ నుండి కాజీపేట వెళ్లే వాహనాలు ములుగు రోడ్డు హన్మకొండ చౌరస్తా, అశోక జంక్షన్, హనుమకొండ బస్టాండ్ మీదుగా కాలోజీ జంక్షన్ ద్వారా కాజీపేట చేరుకోవలెను. కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు ములుగు రోడ్డు, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లి డబ్బాల మీదుగా కేయుసి క్రాస్ రోడ్డు గుండా కరీంనగర్ వైపు వెళ్ళవలెను.
3.కాజీపేట మరియు సుబేదారి నుండి హనుమకొండ, వరంగల్, కరీంనగర్ వచ్చే వాహనాలు కాళోజి జంక్షన్ మీదుగా బాలసముద్రం హనుమకొండ బస్టాండ్ జంక్షన్, అశోక జంక్షన్, ములుగు రోడ్డు మీదుగా వరంగల్ కు వెళ్ళవలెను. పెద్దమ్మ గడ్డ, పెగడపల్లి డబ్బాలు, కేయుసి క్రాస్ రోడ్డు నుండి కరీంనగర్ వెళ్ళవలెను. ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం ఇట్టి విషయాన్ని గమనించి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించి పోలీసులకు సహకరించాలని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూధన్ కోరారు.