అంబేద్కర్ భవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో డా. బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ లు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. వేదిక వద్ద డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడారు. డా. బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఘనంగా, వైభవంగా ప్రజలందరి సమక్షంలో జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిదని ఆయన గుర్తు చేశారు. అంబేద్కర్ వేడుకలు ఘనంగా వాడవాడలో అధికారికంగా అనధికారికంగా దేశమంతటా నిర్వహిస్తున్నటువంటి తరణంలో నేడు భారతదేశం గర్వపడదగిన విధంగా అంబేద్కర్ ఆలోచనల విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి ఈ 132వ జయంతి సందర్భంగా వేలాదిమంది ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకోవడం గర్వించదగిన విషయమన్నారు. ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ కొరకు గాంధేయ మార్గంలో అహింస వాదనతో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా 14 ఏళ్ల పాటు తెలంగాణ సాధనకై పోరాటాన్ని కొనసాగించారని గుర్తుచేశారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలతోనే పేద బలహీన బడుగు వర్గాల కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళిత బంధు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ ఈ సందర్భంగా తెలిపారు.భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ చూపిన సన్మార్గంలో నడుస్తూ వారి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కంకణ బద్ధులై పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంబేద్కర్ ఎన్నో డిగ్రీ , పీజీ ఉన్నతమైన చదువులు చదివి, ఎంతో జ్ఞానాన్ని సంపాదించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే కాకుండా భారత దేశంలోని ప్రతీ ఒక్క వర్గానికి సమన్యాయం చేసుకుంటూ రాజ్యాంగంలో పొందుపర్చారని కలెక్టర్ తెలిపారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ, నిర్మాణంలో బాబాసాహెబ్ ప్రాధాన్యత ఎంతో ఉందని సిక్తా పట్నాయక్ కొనియాడారు. అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో దేశ సమూల అభివృద్ధికై రచించిన రాజంగాన్ని ఇప్పటికి ఆచరిస్తూ, భవిష్యత్తులోనూ కొనసాగించడం జరుగుతుందన్నారు. ఆయన వేసిన బాటలో దేశం పురోగ మిస్తున్నదని, అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతీ ఒక్కరూ కంకణ బద్ధులై, ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. మహిళల అభ్యునతికి పాటుపడిన మహానుభావుడని గుర్తు చేశారు.
డా.బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అభిమానం నుంచి, ఆత్మగౌరవం నుంచి, అసమానతల నుంచే ఏర్పడిందని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. అంబేద్కర్ ఏ విధంగా ఆలోచన చేసేవారు, ఎలా కష్టపడి చదివి, బడుగు బలహీన వెనుకబడిన వర్గాల ప్రజలలో ఎలాంటి చైతన్య ప్రదమైన ఆలోచన విధానాలను తీసుకురావాలని చేశారో, వారి ఆలోచనలకనుగుణంగా విద్యార్థులందరూ అసమానతలను తొలగించి, ముందుకు సాగాలని కోరారు.అంబేద్కర్ అనే వ్యక్తి కాదు. సామూహిక శక్తి అని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలో వచ్చే మార్పు విధానమే ‘అంబేద్కర్ ఇజం’అని సీపీ రంగనాథ్ తెలిపారు.
ప్రపంచ మేధావి, భారతరత్న, మన దేశంలో అనేక కులాలు మతాలు సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నప్పటికీ అందరూ ఒకే విధంగా కట్టుబడి ఉండేలా, ఒక ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగాన్ని రూపొందించారని జెడ్పీ చైర్మన్ అన్నారు. వ్యక్తులలో వివక్ష వస్తే, ఆ వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది, ఆ పోరాటాల ఫలితమే ఆనాడు స్వతంత్రం వచ్చిందని, ఈనాడు తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణి, డీఆర్వో వాసుచంద్ర, ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి నిర్మల, హనుమకొండ తహసిల్దార్ రాజకుమార్, స్థానిక కార్పొరేటర్ స్వరూప, ఇతర జిల్లా స్థాయి అధికారులు, ఎస్సీ, ఎస్టీ దళిత సంఘాల నాయకులు, అంగన్ వాడి, సీడీపీఓలు, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ, గురుకుల పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.