అంబేద్కర్ ఒక సామూహిక శక్తి : సీపీ

అంబేద్కర్ ఒక సామూహిక శక్తి : సీపీ

కుమార్ పల్లి బుద్ధభవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీ ఏవీ రంగనాథ్అంబేద్కర్ ఒక సామూహిక శక్తి : సీపీవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ కుమార్ పల్లి బుద్ధభవన్ లో రెండురోజుల కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని నేడు బుద్ధభవన్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బంటు రాజ్ లెనిన్ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండ్రోజుల వేడుకల్లో భాగంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ వేడుకలకు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్ కుమార్, జనగామ డీపీఆర్వో రాజేంద్రప్రసాద్ లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. కుమార్ పల్లి బుద్ధభవన్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన డా.బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సీపీ రంగనాథ్ మాట్లాడారు. అంబేద్కర్ అనే వ్యక్తి కాదు,సామూహిక శక్తి అని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలో వచ్చే మార్పు విధానమే ‘అంబేద్కర్ ఇజం’ అని సీపీ కొనియాడారు. అంబేద్కర్ ఏ విధంగా ఆలోచన చేసేవారు, తన చిన్నతనం లో ఎలా కష్టపడి చదివి, ఉన్నత చదువుల కై విదేశాలకు వెళ్లి , ఎన్నో అవమానాలను అధిగమించి మన దేశానికి భారత రాజ్యాంగాన్ని రూపొందించారనే విషయాలని ఈ సందర్భంగా సీపీ గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా బడుగు బలహీన వెనుకబడిన వర్గాల ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ లు కల్పించారని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలకనుగుణంగా విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగుతూ, సమాజాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని సీపీ కోరారు.తదుపరి కార్యక్రమంలో ఆటల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి సీపీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు బంటు లెనిన్ మాట్లాడారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వరంగల్ సీపీ ఏవి రంగనాథ్ కి అభినందనలు తెలియజేశారు. సీపీ చెప్పిన విధంగా అంబేద్కర్ ఆశయ సాధనల కోసం మేమంతా కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ భవన్ డెవలప్మెంట్ అధ్యక్షులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తో పాటు వంగాల సుదర్శన్, అంకేశరపు సారయ్య, టోర్నమెంట్ అధ్యక్షులు యాల్ల సంజయ్, సెక్రటరీ సాధు వేణుగోపాల్, ట్రెజరర్ కీసర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.