కైకాల అంత్యక్రియలకు హాజరైన మంత్రి ఎర్రబెల్లి 

కైకాల అంత్యక్రియలకు హాజరైన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : నేడు మహాప్రస్థానంలో జరిగిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై నివాళులు అర్పించారు. ఘటోత్కచుడు, యమధర్మరాజు వంటి విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో సినీ అభిమానులను అలరించి 878 సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణ, ఎంపీ గా కూడా రాజకీయాల్లో రాణించారని అన్నారు. కీర్తిశేషులు కైకాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేసినప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, సత్యనారాయణ తనతో ఆత్మీయంగా, సన్నిహితంగా ఉండేవారని మంత్రి ఆయన కొడుకులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.కైకాల అంత్యక్రియలకు హాజరైన మంత్రి ఎర్రబెల్లి స్వర్గీయ సత్యనారాయణకు మాజీ సీఎం ఎన్టీఆర్ తో, టీడీపీ పార్టీతో అవినాభావ సంబంధం ఉందని అన్నారు. అన్న ఎన్టీఆర్ , కైకాల సత్యనారాయణకి ఎంతో గౌరవం ఇచ్చేవారని మంత్రి స్మరించుకున్నారు. కైకాల సత్యనారాయణ నటుడిగా, రాజకీయ నేతగా చేసిన సేవలకు గుర్తింపుగానే సీఎం కేసీఆర్ ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారని తెలిపారు. సత్యనారాయణ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. ఆయన భౌతికంగా మనను విడిచి వెళ్లినప్పటికీ నటుడిగా, మంచి వ్యక్తిగా ఎప్పటికీ మనతోటే ఉంటారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.