తొలి మహిళా క్రికెట్ కోచ్ ఎవరో తెలుసా ?
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : మహిళా క్రికెట్ కోచ్ గా ఐసీసీ-అకాడమీ కోచ్ ఎడ్యుకేషన్ కోర్సు లో లెవల్-1సర్టిఫికెట్ సాధించిన బుర్రా లాస్య ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డా. వి.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మంత్రి డా.వి. శ్రీనివాస్ గౌడ్ ను బుర్రా లాస్య, తండ్రి బుర్రా రమేష్ గౌడ్ లు మర్యాదపూర్వకంగా కలిసారు. బుర్రా లాస్య తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారిగా మహిళ క్రికెట్ కోచ్ గా ఐసీసీ-అకాడమీ కోచ్ ఎడ్యుకేషన్ కోర్సు లో లెవల్-1 సర్టిఫికెట్ సాధించడం గర్వంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుర్రా లాస్యతో పాటు, బుర్రా లాస్యను ప్రోత్సహించిన ఆమె తండ్రి రమేష్ గౌడ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్ తో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను తయారు చేయడం కోసం సుమారు 8500 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామని తెల్పారు. క్రీడా పాలసీలో క్రీడాకారులకు, కోచ్ లకు పెద్దపీట వేస్తున్నామన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. అలాగే, క్రీడా రంగంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తన్నామన్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఐసీసీలో బుర్రా లాస్య లెవల్ -1 క్రికెట్ కోచ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసిన తొలి మహిళా కోచ్ గా చరిత్ర సృష్టించినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుర్రా లాస్యను అభినందించారు. తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.