సుప్రీంకోర్టు జడ్జిగా దీపాంకర్ దత్తా ప్రమాణం
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణస్వీకారం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒకటో నంబర్ కోర్టులో సీజేఐ చంద్రచూడ్ సమక్షంలో ఆయన ప్రమాణం స్వీకారం చేశారు. దీంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. మరో 6 జడ్జిల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సుప్రీం కోర్టులో సీజేఐతో సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34.
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని ఈ యేడాది సెప్టెంబర్ 26న అప్పటి సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. దీనికి కేంద్ర న్యాయశాఖ డిసెంబర్ 11న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో ఫిబ్రవరి 8, 2030 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ దీపాంకర్ దత్తా 1965, ఫిబ్రవరి 9న జన్మించారు. దీపాంకర్ దత్తా తండ్రి జస్టిస్ సలీల్ కుమార్ దత్తా కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జూన్ 22, 2006న సలీల్ దత్తా పదవీ విరమణ చేశారు.