నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యుల వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు తెలిపారు. ఉద్యోగాల పేరిట నగరంలోని నిరుద్యోగుల నుంచి రూ. 1.5 కోట్లు ముఠా వసూలు చేసింది. రైల్వేలో, మెట్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన ముఠా వారిని సంప్రదించినప్పుడల్లా సమాధానం దాటవేసింది.

దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. ముఠా ప్రధాన సూత్రధారి సురేంద్ర గుంటూరు వాసి. మోసం చేసిన సొమ్ముతో సురేంద్ర కార్లు, స్థిరాస్తులు కొనుగోలు చేశారు. ఉప్పల్ లో ఒక ఇల్లు, హోటల్ , 4 కార్లు కొన్నాడు. గతంలోనూ సురేంద్రపై కేసులు నమోదయ్యాయి. సుమారు 15 మంది నుంచి డబ్బులు వసూలు చేశారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.