స్నాతకోత్సవ వేడుకకు సిద్ధమైన ఓయూ

స్నాతకోత్సవ వేడుకకు సిద్ధమైన ఓయూస్నాతకోత్సవ వేడుకకు సిద్ధమైన ఓయూ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఠాగూర్ ఆడిటోరియంలో జరుగనున్న ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్ లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్య అతిథిగా ఓయూ పూర్వ విద్యార్థి, అడోబ్ సీఈవో శంతన్ నారాయణ్ హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో 2021 జులై నుంచి 2022 అక్టోబర్ వరకు స్వర్ణ పతకాలు, పీజీ పట్టాలతో పాటు 2022 ఆగస్టు నుంచి 2023 అక్టోబర్ వరకు ఎంఫిల్, పీహెచ్ డీ పట్టాలు సాధించిన వారికి వాటిని ప్రదానం చేయనున్నారు.

గవర్నర్, ముఖ్య అతిథుల చేతుల మీదుగా పీజీ, పీహెచ్ డీలలో స్వర్ణ పతకాలు సాధించిన 57 మందికి పట్టాలు ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు దాదాపు 700 మందికి పీహెచ్ డీ పట్టాలు అందించనున్నారు.యూజీలో స్వర్ణ పతకాలు సాధించిన వారికి వారి వారి కాలేజీలకు పతకాలను పంపిస్తారు.ఈ వేడుకల్లో వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ రవీందర్ వర్సిటీ నివేదికను సమర్పిస్తారు. అనంతరం గవర్నర్, ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరిన్ని వివరాలకు ఓయూ వెబ్ సైట్ www.osmania.ac.in లో చూడవచ్చని అధికారులు తెలిపారు.