నేడే ఉమ్మడి వరంగల్ లో ‘ప్రజా దీవెన సభ’*’ప్రజా దీవెన సభ’లో పాల్గొననున్న కేసీఆర్
* మహబూబాబాద్,భట్టుపల్లిలో ‘ప్రజా దీవెన సభ’లు
* బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి
* సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన సత్యవతి,దాస్యం
* ముచ్చటగా మూడోసారి మాదే అధికారం-దాస్యం
* ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన సీపీ
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి, రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు.ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మొట్టమొదటి ప్రజా ఆశీర్వాద సభను హుస్నాబాద్, జనగామలో ఏర్పాటు చేయగా సీఎం పాల్గొన్నారు. దసరా పండుగ అనంతరం పర్యటనలో భాగంగా ఉమ్మడి వరంగల్ లో రెండు సభలను శుక్రవారం ఒకే రోజు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సీట్లకు 12 సీట్లను గెలిపించుకోవడమే లక్ష్యంగా గులాబీ దళపతి ఎన్నికల పర్యటనను చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ప్రజా ఆశీర్వాద సభను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యవేక్షిస్తున్నారు.అయితే శుక్రవారంవరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని భట్టుపల్లిలో నిర్వహించే ‘ప్రజా దీవెన సభ’కు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఇందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు బహిరంగ సభా ప్రాంగణంలో గురువారం పర్యటించారు. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు.పదేండ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ గుర్తు చేయనున్నారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధిని, అందించే సంక్షేమ ఫలాలను వివరించనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఫలాలను అందుకుంటున్న ప్రజలు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరనున్నారు.అలాగే ప్రతిపక్ష పార్టీలు, తెలంగాణ రాకముందు ఉన్న ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని, విస్మరించిన హామీలను ఆయన ఎండగట్టనున్నారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల విమర్శలను దాస్యం తిప్పికొట్టారు.శుక్రవారం సాయంత్రం భట్టుపల్లిలో జరిగే ప్రజా దీవెన సభలో సుమారు 80 వేల మంది హాజరుకానున్నారని చీఫ్ విప్ తెలిపారు.అనేక సభలు నిర్వహించి, 10 యేళ్లలో అభివృద్ధి,సంక్షేమమే ధ్యేయంగా ప్రభు్తవం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని గుర్తు చేశారు. ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరిచిన పథకాలను విమర్శించే నైతిక అర్హత ప్రతిపక్ష పార్టీలకు లేదని ఆయన హెచ్చరించారు.గ్యారంటీ, వారంటీ లేని పథకాల విషయంలో కాంగ్రెస్ ఇప్పటికే వేరే రాష్ట్రాల్లో విఫలమైందని ఎద్దేవా చేశారు. భట్టుపల్లిలో పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుంది కావున కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని దాస్యం పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమని 100 సీట్లకు పైగా గెలుస్తామని చీఫ్ విప్ ధీమా వ్యక్తం చేశారు.అందులో తాను కూడా ఒక్కడినని అధిక మెజారిటీ ఇచ్చి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.అనంతరం సభ ఏర్పాట్లను పరిశీలించారు.పార్కింగ్ ప్రదేశాలు,సభా వేదిక,హెలిప్యాడ్ కు సంబంధించిన స్థలాన్ని వర్ధన్న పేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు,డిసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి,మేయర్ గుండు సుధా రాణి,రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు లలిత యాదవ్,కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు,నాయకులు వనం రెడ్డి, పోలపల్లి రామ్మూర్తి,ప్రేమ్ సాగర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.-ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
భట్టుపల్లిలో కేసీఆర్ పర్యటన సందర్భంగా నగరంలోని భట్టుపల్లి, కడిపికొండ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.భారీ వాహనాలకు మరియు ట్రక్కులకు కడిపికొండ ఫ్లైఓవర్ మీదుగా అనుమతి లేదని తెలిపారు.హైదరాబాదు నుండి వరంగల్, ఖమ్మం వచ్చే భారీ వాహనాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద గల ఓఆర్ఆర్ మీదుగా, ఎనుమాముల మార్కెట్,తెలంగాణ జంక్షన్, ఫోర్ట్రోడ్డు మీదుగా ఖమ్మంకు వెళ్లాల్సి ఉందని సూచించారు.అదే విధంగా ఖమ్మం నుండి హైదరాబాదు వెళ్లాల్సిన భారీ వాహనాలు నాయుడు పంపు నుండి పోర్టురోడ్డు,తెలంగాణ జంక్షన్,ఎనుమాముల మార్కెట్ నుండి ఓరర్ మీదుగా హైదరాబాదుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.కావున మీటింగ్ జరిగే ప్రదేశం ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రై సిటి పరిధిలో భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా అక్టోబర్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6.30 ని.ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.