కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే పెద్ది బహిరంగ లేఖ

కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే పెద్ది బహిరంగ లేఖ

కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే పెద్ది బహిరంగ లేఖ

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణా రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యుడిగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంత బిడ్డగా కేంద్రమంత్రిగా ఉన్నారు. కానీ కేంద్రమంత్రిగా ఉన్న మీరు ఆ భాద్యతలు మరిచి అడ్డగోలు చిల్లర విమర్శలకే పరిమితమయ్యారు తప్ప ఏనాడూ తెలంగాణ ప్రయోజనాలకోసం పనిచేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయినట్టుగానే, నేడు కేంద్రమంత్రిగా ఉండి కూడా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తేలేక ఒక అసమర్థునిగా మిగిలిపోతున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రాలకు కేంద్రం నిధులిస్తుంటే పట్టించుకోకుండా సిగ్గులేకుండా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని లేఖలో తెలిపాడు.

తెలంగాణ ప్రభుత్వం గోదావరి వరదల సమయంలో రూ.1000 కోట్ల సహాయాన్ని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హైదరాబాద్ లో బారీ వర్షాలతో వరదలొస్తే బండి పోతే బండి ఇస్తాం అంటూ డంభాచారాలు పలికి అర్ధరూపాయి సాయం కూడా చేయలేకపోయారు. తెలంగాణ ప్రభుత్వమే వారిని ఆదుకుంది. వరంగల్ జిల్లాలో గత ఏడాది జనవరిలో వడగల్ల వాన సృష్టించిన విధ్వంసానికి రైతులు తీవ్రంగా నష్టపోతే తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి నష్టపోయిన రైతులకు ఇన్ పుడ్ సబ్సిడి అందించి ఆదుకుందని లేఖలో తెలిపారు. తెలంగాణా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు మాత్రం అర్ధరూపాయి సాయం చేయకపోగా కనీసం ఇటువైపు చూడనూ లేదన్నారు. తెలంగాణకు ప్రతీ విషయంలో మొండిచెయ్యి చూపుతారు, కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు మరియు ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రం అడక్కుండానే నిధులు ఇస్తూ మీ ప్రభుత్వం వక్రబుద్దిని చాటుకుంటుందని లేఖలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని వరదసాయం అడిగితే మొండి చేయి చూపించిన మోదీ సర్కారు బీజేపీ పాలిత, ఎన్నికలున్న ఐదు రాష్ట్రాలకు రూ.1,816.16కోట్లను ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కింద కేటాయించిందిందని విమర్శించారు. గోదావరి వరదల సమయంలో మాకు రూ.1000కోట్లు వరదసాయం ఇవ్వాలని తెలంగాణ సర్కారు కేంద్రాన్ని అడిగింది. ఒక్కరూపాయి కూడా మంజూరు చేయని బీజేపీ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి రూ..941.04కోట్లు, మేఘాలయ రాష్ట్రానికి రూ.47.33కోట్లు, అస్సాం కు 520.466కోట్లు, హిమాచల్ ప్రదేశ్ కు 239.31కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ పై బీజేపీ ప్రభుత్వం సవతితల్లి ప్రేమను చూపుతుందనడానికి ఇవన్నీ నిదర్శనాలేనని తెలిపారు.

మీ చేతగానితనం తెలంగాణకు శాపంగా మారింది. అర్ధరూపాయి కూడా తెలంగాణకు విపత్తులకు వచ్చే సహాయనిధిని తేలేకపోయారు. ఇది చేతకాదు కానీ సీఎం కేసీఆర్ పై, వారి కుటుంబంపై చిల్లర విమర్శలు చేస్తూ నిస్సిగ్గుగా నీచ రాజకీయం చేస్తున్నారు. ప్రజల అవసరాలను విస్మరించి, ప్రశ్నించిన వారిపై, నిలదీసిన వారిపై కక్ష సాదింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని ఎమ్మెల్యే పెద్ది పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిదుల్లో అన్యాయం, ఈ ప్రాంతానికి హక్కుగా రావాల్సిన వాటాలపై కేంద్రాన్ని అడగడం చేతకాదని కిషన్ పై పెద్ది లేఖలో ధ్వజమెత్తాడు. పకృతి వైపరిత్యాలకు కేంద్రం నుండి నిదులు తీసుకురావటానికి చేతకాలేదు కానీ అడ్డగోలు విమర్శలు,అబద్దపు కూతలు చేస్తూ అసమర్థుడిగా మిగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణను అభివృద్ది చేస్తున్నసీఎం కేసీఆర్ పాలనను చూసి ఓర్వలేక చిల్లర మల్లర విమర్శలు చేస్తూ అధికార వాంఛతో అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు. దమ్ముంటే తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కేంద్రంలోని మీ మోదీ ప్రభుత్వంతో మాట్లాడండి. చేతనైతే తెలంగాణకు విపత్తు సాయం తెచ్చి మాట్లాడండి, మీ వికృత రాజకీయ క్రీడలను ప్రజలు గమనిస్తున్నారు. మీ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుంది. ప్రజలే మీకు సరైన బుద్ది చెబుతారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో కేంద్రమంత్రి అయిన మీరు, ఈ ప్రాంత ప్రజల అవసరాలను విస్మరించి నిస్సిగ్గుగా చిల్లర రాజకీయాలను చేయటం హేయమైన చర్య. దీనికి మూల్యం చెల్లించుకోకతప్పదని పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు..