కేరళలో కరోనా కల్లోలం

కేరళలో కరోనా కల్లోలంన్యూఢిల్లీ : ఒమిక్రాన్ వ్యాప్తితో కేరళలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం అత్యధికంగా 46,387 తాజా కేసులు నమోదయ్యాయి. మార్చి 2020లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 24 గంటల్లో 15,388 మంది కోలుకోగా, వైరస్ బారినపడి ఒక్కరోజులో 309 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేరళలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 51,501 కి ఎగబాకింది.

ఇక బుధవారం కేరళలో 34,199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 707 కు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మరోవైపు భారత దేశంలో గురువారం తాజాగా 3,17,532 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి దేశవ్యాప్తంగా 380 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.