ఛీ ఛీ.. కసాయి తల్లి!

ఛీ ఛీ.. కసాయి తల్లి!

-ఏడుపు ఆపలేదని… పసిబిడ్డను పొయ్యిలోకి విసిరేసిన తల్లి
-హైదరాబాద్ బౌరంపేటలో అమానుష ఘటన
-తండ్రి ఫిర్యాదుతో తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపుఛీ ఛీ.. కసాయి తల్లి!
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: బౌరంపేటలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏడుపు ఆపడం లేదని రెండు నెలల పసికందును ఓ కసాయి తల్లి పొయ్యిలో విసిరేసిన అమానవీయ ఘటన నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర ఆదివాసి (21), మమత అహిర్వార్ (20) దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. బౌరంపేటలోని ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో కార్మికులుగా పనిచేస్తూ, అక్కడే ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్డులో నివసిస్తున్నారు. వీరికి రెండు నెలల కుమారుడు ఉన్నాడు. సోమవారం రాత్రి బాబు నిరంతరం ఏడుస్తుండటంతో తల్లి మమత తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఏడుపు ఆపడానికి బాబు నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి, ఆపై మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది.

 

పని ముగించుకుని వచ్చిన తండ్రి రాజేంద్ర.. బాబు కనిపించకపోవడంతో భార్యను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వెతకగా, పొయ్యిలో కాలిపోయిన స్థితిలో బాబు మృతదేహం కనిపించింది. భర్త ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలైన తల్లి మమతను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.