బ్రహ్మోస్ క్షిపణి టెస్ట్ సక్సెస్ ఫుల్

బ్రహ్మోస్ క్షిపణి టెస్ట్ సక్సెస్ ఫుల్బాలాసోర్ : డీఆర్డీవో ( భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ ) మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ నూతన వర్షన్ ను నేడు టెస్ట్ చేసింది. ఒడిశా తీరంలోని బాలాసోర్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణి పరీక్ష నిర్వహించారు. ఈ విషయాన్ని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ కు తాజాగా కొన్ని నూతన సాంకేతికతలను జోడించారు. ఆ నూతన సాంకేతికతలు విజయవంతంగా పనిచేస్తాయా.. లేదా .. అనేది నిర్ధారణ చేసుకోవడం కోసం నేడు పరీక్షించి చూశారు. ఈ పరీక్ష విజయవంతమైంది. నూతన సాంకేతికతలు సమర్థంగా పనిచేస్తున్నాయని రుజువైంది.

సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం గల ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను భారత్ కు చెందిన డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్పీవోఎం కలిసి అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణులను భూమి మీద నుంచి, ఆకాశంపై నుంచి, సముద్రం నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణులను యాంటీషిప్, లాండ్ ఎటాక్ ఇలా రెండు పాత్రలు పోషించేలా రెండు రకాలుగా డిజైన్ చేశారు. ఈ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ఇప్పటికే ఇండియన్ నేవీలో, ఇండియన్ ఆర్మీలో సమర్థంగా వినియోగిస్తున్నారని డీఆర్డీవో పేర్కొంది.