తొలి ఒమిక్రాన్ మరణంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

తొలి ఒమిక్రాన్ మరణంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రంన్యూఢిల్లీ : భారత దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్థాన్ లో నమోదైందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021, డిసెంబర్ 30న మహారాష్ట్రలో ఓ 52 యేండ్ల ఒమిక్రాన్ బాధితుడు మరణించాడు. ఆ తర్వాత రోజే డిసెంబర్ 31న రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ సిటీలోని లక్ష్మీనారాయణ్ నగర్ లో 73 యేండ్ల వ్యక్తి ఒమిక్రాన్ తో బాధపడుతూ తుదిశ్వాస విడిచాడు.

దీంతో మహారాష్ట్రలో మరణం తొలి ఒమిక్రాన్ మరణంగా, రాజస్థాన్ మరణం ఒమిక్రాన్ రెండో మరణంగా నమోదయ్యాయి. అయితే మహారాష్ట్ర బాధితుడి మరణానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణం కాదన్న అనుమానంతో ఇతర పరీక్షలు చేశారు.

ఆ పరీక్షల్లో మహారాష్ట్ర వ్యక్తి మరణానికి ఒమిక్రాన్ కారణం కాదని తేలింది. ఇతర అనారోగ్య కారణాల వల్ల అతను మరణించినట్లు తెలిసింది. దీంతో రాజస్థాన్ లో నమోదైన రెండో మరణమే తొలి ఒమిక్రాన్ మరణంగా కేంద్రం స్పష్టం చేసింది. కాగా మన దేశంలోకి ఒమిక్రాన్ నవంబర్ 24న ప్రవేశించింది. ఆ తర్వాత నుంచి రోజూ క్రమం తప్పకుండా కేసుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 2,135కి చేరింది.