హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మొదటి డోస్ 102 శాతం పూర్తైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు అన్నారు. ఉచిత టీకా పంపిణీలో తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. చార్మినార్ వద్ద గల ప్రభుత్వ యునాని ఆస్పత్రిలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ , ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీతో కలిసి మంత్రి హరీష్ రావు బూస్టర్ డోస్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. యునాని ఆస్పత్రిలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మొదటి బూస్టర్ డోస్ ను ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ ఖాన్, పాషా ఖాద్రీ తీసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మొదటి బూస్టర్ డోస్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో వేగంగా టీకా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, టీకా విషయంలో ప్రజలు ఎలాంటి సంశయాలు పెట్టుకోవద్దని మంత్రి సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతీ ఒక్కరూ కరోనా వైరస్ ను తరిమికొట్టాలని హరీష్ రావు కోరారు. అనంతరం యునానీ ఆస్పత్రిలో సమస్యలపై చర్చించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆస్పత్రిలో సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.