క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : మెగా హీరో వరుణ్ తేజ్ తో పెళ్లి అంటూ వస్తున్న పుకార్లకు నటి లావణ్య త్రిపాఠి ఫోటోలతో సమాధానమిచ్చింది. ప్రస్తుతం తాను సొంతూరులో కుటుంబసభ్యులతో ఉన్నట్లు తెల్పింది. దీంతో బుధవారం నుంచి వస్తున్న పెళ్లి పుకార్లకు తెరపడినట్లైంది. వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోల వల్లే ఇదంతా జరిగింది.‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఆరెండు సినిమాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ చేసి వీళ్లిద్దరూ లవ్ లో ఉన్నారని ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాకుండా వరుణ్ తేజ్ సోదరి నటి నిహారిక పెళ్లికి లావణ్య త్రిపాఠి హాజరైంది. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.
కానీ ఆ తర్వాత ఎలాంటి పుకార్లు రాలేదు. బుధవారం వరుణ్ బర్త్ డే కావడం వల్ల, వేడుకల కోసం వరుణ్ బెంగుళూరు వెళ్లారు. ఆ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో పుకార్ల తాకిడి మళ్లీ మొదలైంది. లావణ్యతో కలిసి బర్త్ డే పార్టీ స్పెషల్ గా చేసుకోవడానికే వరుణ్ బెంగుళూరు వెళ్లారని , ఆమె కోసం అత్యంత ఖరీదైన డైమండ్ రింగ్ కొనుగోలు చేశారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు ఆ నోటా ఈ నోటా పడి లావణ్య దగ్గరకు చేరినట్లున్నాయి.
దీనిపై లావణ్య సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించారు. డెహ్రాడూన్ లో ఉన్నానంటూ ఫ్యామిలీతో కలిసి ఉన్నట్లు కొన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేశారు. ప్రకృతి అందాలు తన మనసును కట్టిపడేస్తున్నాయని ఆ ఫోటోలతో పాటు పోస్టులో రాసుకొచ్చారు. లావణ్య షేర్ చేసిన కొత్త ఫోటోలతో ఆమె పెళ్ళి, ప్రేమ వార్తలకు మరోసారి చెక్ పడినట్లు తెలుస్తోంది.