పార్లమెంట్ లో కరోనా కలకలం..402 మందికి కొవిడ్

పార్లమెంట్ లో కరోనా కలకలం..402 మందికి కొవిడ్న్యూఢిల్లీ : పార్లమెంట్ లో కరోనా కలకలం సృష్టించింది. 400 మందికి పైగా సిబ్బంది, అధికారులు కొవిడ్ బారినపడ్డారు. వారితో సన్నిహితంగా మెలిగిన మిగతా సిబ్బందిని ఐసోలేషన్ కు తరలించారు. కరోనా సోకిన వారిలో 200 మంది లోక్ సభ, 69 మంది రాజ్యసభ సిబ్బంది సహా మరో 133 మంది సహాయ సిబ్బంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

జనవరి 4 నుంచి 8 వరకు మొత్తం 1409 మందికి చేపట్టిన కరోనా పరీక్షల్లో 402 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణకు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్ కరోనా కలకలం సృష్టించిన నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పరిస్థితిని సమీక్షించారు. ఈ నెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు, గర్భిణీలు ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతులిచ్చారు. రాజ్యసభ సచివాలయం సమయాల్లో మార్పులు చేశారు. అధికారిక సమావేశాలను వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. సిబ్బంది హాజరును సగానికి తగ్గించినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ తెల్పింది. కొత్త ఆదేశాల ప్రకారం సెక్రెటరీ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ర్యాంక్ కింది స్థాయి అధికారులు, సిబ్బంది 50 శాతం మంది జనవరి 31 వరకు వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.