అప్పటి వరకు మా ఆందోళనలు ఆగవు : మంత్రి ఎర్రబెల్లి

అప్పటి వరకు మా ఆందోళనలు ఆగవు : మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలు దించేదాకా మా ఆందోళన కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. కేంద్రం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, ఎల్ రమణ, దండే విఠల్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కడిపిపారేశారు.

ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు, రైతులకు ఎంతమేరకు న్యాయం చేశారో ఆలోచించుకోవాలని దయాకర్ రావు ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు పాలించిన దాని కన్నా సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులకు ఎక్కువ న్యాయం జరుగుతుందని అన్నారు. రైతు నాయకులుగా ముద్రపడిన దేవిలాల్, చరణ్ సింగ్ ల కంటే ఒక పాటు ఎక్కువగానే కేసీఆర్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ మాత్రం రైతుల పట్ల కక్ష కట్టి పాలిస్తోందన్నారు. బీజేపీ రైతాంగ వ్యతిరేక విధానాలపై కేసీఆర్ ఉద్యమానికి నడుం బిగించారని తెలిపారు. ఎరువుల ధరల పెంపు ఇతర అంశాలపై మోడీకి కేసీఆర్ లేఖ రాశారు

బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఇప్పటికే రైతుల నడ్డి విరిచిందని మండిపడ్డారు. ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టేలా ఎరువుల ధరలు పెంచారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా ఎరువుల ధరలు పెంచడాన్ని సమర్ధించేలా మాట్లాడుతున్నారని మంత్రి దయాకర్ రావు మండిపడ్డారు. 2 లక్షల 71 వేల కోట్ల రూపాయలు రైతులకు వెచ్చించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథాకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని మోడీని కోరి ఐదేళ్లు అవుతున్నా ఉలుకు లేదు, పలుకు లేదని విమర్శించారు.