ప్రెస్ మీట్లతో డ్రామాలు రేవంత్ కి అలవాటే : ఎర్రబెల్లి

ప్రెస్ మీట్లతో డ్రామాలు రేవంత్ కి అలవాటే : ఎర్రబెల్లిహైదరాబాద్ : ప్రెస్ మీట్లతో డ్రామాలు చేయడం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అలవాటేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి అప్పటి ప్రభుత్వం రైతులకు ఏదో మేలు చేసిందని రేవంత్ చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు.

తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, ఎల్ రమణ, దండే విఠల్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కడిపిపారేశారు. శ్రీరామ్ సాగర్ ఆయకట్టును ఎండబెట్టింది కాంగ్రెస్ పాలన కాదా అని ప్రశ్నించారు. వ్యవసాయం సర్వనాశనం కావడానికి కాంగ్రెస్, బీజేపీ విధానాలే కారణమని నిప్పులు చెరిగారు.

టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలపై పోరాడలేదా అని మంత్రి ఎర్రబెల్లి సూటిగా ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్ , బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేశారో చెప్పాలని, తర్వాత చర్చకు వచ్చే దాని గురించి మాట్లాడాలన్నారు.

ప్రతిపక్షాలు కేసీఆర్ ను పొగడకున్నా పర్వాలేదు. తిడితే పాపం తాకుతుందని అన్నారు. రైతులకు కేసీఆర్ ఎంతో చేసిన మహానుభావుడని కొనియాడారు. ఇంకా ఎంతో చేస్తారు. కరోనా వచ్చి కొన్ని ప్రతిపాదనలు ఆగిపోయాయన్నారు. ఏం చేయని పార్టీలు మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఉందా అని ప్రశ్నించారు.