ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం

ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రంహైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్టరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షాపాతం నమోదైంది. బుధ, గురువారాల్లోనూ వర్షాలు కురుస్తాయని, ఈక్రమంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మంగళవారం ఉత్తర తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసాయి. నిర్మల్, కుమ్రంభీం, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాలలో తేలికపాటి భారీ వర్షం నమోదైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో 4.8 , రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3, నిర్మల్ జిల్లా పెంబిలో 3, కుమ్రంభీ జిల్లా గిన్నెదరిలో 3, రాజన్న సిరిసిల్ల కందికట్కూరులో 3, మంచిర్యాల నస్పూర్ లో 3, జగిత్యాల సిరికొండలో 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసిందని టీఎస్ డీపీఎస్ తెలిపింది. పలు చోట్ల ఈదురుగాలులతో వర్షం కురువగా, మరికొన్ని చోట్ల వడగాళ్ల వాన కురిసింది.

ఇదిలా ఉండగా మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ , జగిత్యాల, రాజన్న సిరిసిల్ల , కామారెడ్డి, మంచిర్యాల జిల్లా్లో వడగండ్ల వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని పేర్కొంది. 13న ఆదిలాబాద్ , కుమ్రంభీం ఆసిఫాబాద్ , మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,నిర్మల్, జగిత్యాల, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్ , జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.