కేసీఆర్ మహాసంకల్పానికి నమస్కరిస్తున్నా : మంత్రి ఎర్రబెల్లి

కేసీఆర్ మహాసంకల్పానికి నమస్కరిస్తున్నా : మంత్రి ఎర్రబెల్లిజనగామ జిల్లా : రైతు బంధు సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రైతు బంధు పథకం 2018 సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 74 వేల 193 మంది రైతులకు రూ.721 కోట్ల 67 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే పాలకుర్తి మండలంలో 18 వేల 422 రైతులకు రూ.186 కోట్ల 7 లక్షలు, దేవరుప్పుల మండలం లో 14 వేల 570 రైతులకు రూ.147 కోట్ల 12 లక్షలు, కొడకండ్ల మండలంలో 7 వేల 733 రైతులకు రూ.77 కోట్ల 62 లక్షలు, తొర్రూరు మండలంలో 11 వేల 687 రైతులకు రూ.112 కోట్లు, పెద్దవంగర మండలంలో 6 వేల 481 రైతులకు రూ. 62 కోట్లు, రాయపర్తి మండలంలో 15 వేల 301 రైతులకు రూ.138 కోట్లు రైతుబంధు ఆర్థిక సహాయం అందజేశామని ఆయన తెలిపారు.

రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రంలో 65 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేసిన మొత్తం 50 వేల కోట్ల రూపాయలకు చేరడం గొప్ప విషయమన్నారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించే సందర్భం అని, కేసీఆర్ మహాసంకల్పానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చరిత్రలో ఎప్పుడూ, ఎన్నడూ, ఎవ్వరు అందించని విధంగా రైతుల శ్రేయస్సుకై కేసీఆర్ రైతుబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై గత యేడున్నరేళ్ల కాలంలో రూ. 2.7 లక్షల కోట్లు వ్యయం చేసిందని ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబరాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వేల సంఖ్యలో రైతులు ఎడ్ల బండ్లు ప్రదర్శనలు చేసి పండుగ వాతావరణం తీసుకువచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రైతుబంధు ముగ్గులు వేసి మహిళలు ఆశీర్వచనం ఇచ్చారని ఆయన తెలిపారు. రైతులు పొలాలలో కేసీఆర్ రైతుబంధు పేరుతో అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి వరకు రైతుబంధు సంబరాలు నిర్వహించుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.