స్పోర్ట్స్ డెస్క్ : టీంఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేటట్టు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వర్చువల్ మీడియా భేటీలో బీసీసీఐ వైఖరిని కోహ్లీ తీవ్రంగా తప్పుబట్టారు. ఏకంగా బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాటలకు విరుద్ధంగా విరాట్ తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వివరించాడు. బోర్డుపై ఒక రకంగా దాడి చేసిన విరాట్ వైఖరి పట్ల ఆగ్రహంతో బీసీసీఐ చీఫ్ గంగూలీ అప్పట్లో షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
అయితే బోర్డులోని కీలక సభ్యుల సలహాతో దాదా వెనుకకు తగ్గినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే ఇటీవలే టెస్ట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన కోహ్లీ సోషల్ మీడియాలో విడుదల చేసిన లేఖలో గంగూలీ పేరు కాకుండా బోర్డు కార్యదర్శి జై షా పేరును ప్రస్తావించాడు. కోహ్లీ వీడ్కోలుపై దాదా స్పందిస్తూ అతని వ్యక్తిగత నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుందని, విరాట్ సారథ్యంలో భారత్ అద్భుత విజయాలు సొంతం చేసుకుందని ట్వీట్ చేశాడు.