కొంప ముంచిన నిర్లక్ష్యం..బంధువులకు కరోనా

కొంప ముంచిన నిర్లక్ష్యం
కరోనా మృతదేహం బ్యాగ్‌ తెరవడంతో..!
18 మంది బంధువులకు కొవిడ్‌ నిర్ధారణ

ముంబయి: కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసిందే. దేశంలో రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నా పలువురు మాత్రం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. అందుకు ఉదాహరణే తాజాగా మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకున్న ఈ ఘటన.

కొంప ముంచిన నిర్లక్ష్యం..బంధువులకు కరోనా40 ఏళ్ల ఓ మహిళ ఇటీవల కరోనా వైరస్‌ లక్షణాలతో మృతిచెందింది. వైద్యులు ఆమె మృతదేహాన్ని ప్యాక్‌చేసి బంధువులకు అప్పగించారు. దాన్ని తెరవకుండా నేరుగా అంత్యక్రియలు నిర్వ హించాలని ఆదేశించినా వారు పెడచెవిన పెట్టారు. అంతిమ సంస్కారాల్లో ఆమె మృతదేహం ప్యాక్‌ చేసిన బ్యాగ్‌ను తెరవడంతో బంధువుల్లో 18 మందికి వైరస్‌ సోకింది. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది హాజరయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో మృతురాలికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొన్న 50 మందిని తొలుత క్వారంటైన్‌ చేయగా.. అందులో 18 మందికి శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పుడు మిగతా వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఈ ఘటనపై స్పందించిన ఉల్లాస్‌నగర్‌‌ మున్సిపల్‌ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. సంబంధిత బంధువులపై పోలీస్‌ కేసు నమోదు చేస్తామని చెప్పారు. అంత్య క్రియలకు సంబంధించిన నిబంధనలను వారు ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.