రాహుల్ ని పీఎం చేయడమే మా లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్ టైమ్స్, వికారాబాద్: రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మన లక్ష్యం కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం రాహుల్ గాంధీ పీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ సమావేశాల ముగింపు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ పేరుతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశం కోసం, అందరి కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆయన కోరారు.
గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ చేస్తున్న నిరంతర పోరాటాలే, ప్రస్తుతం ఆయనను ప్రతిపక్ష నేతను చేశాయని సీఎం గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే కాంగ్రెస్ కార్యకర్తల తదుపరి లక్ష్యం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. జడ్పీటీసీ నుంచి సీఎం వరకు ఎదిగిన తన రాజకీయ ప్రస్థానం గురించి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత 19 యేళ్ల కాలంలోనే జడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా, పార్టీలో రకరకాల పదవులు, బాధ్యతలు స్వీకరించి చాలా అనుభవాన్ని సంపాదించినట్లు వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పైరవీలకు తావు లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రజల సమస్యలపైన గళం వినిపించడమే తన ప్రధాన పనిగా పెట్టుకుని ఈ స్థాయికి వచ్చిన తనపై ఎన్నో కేసులు నమోదు చేసినట్లు గుర్తు చేశారు. కేసులు మాత్రమే కాదు, పరువు నష్టం దావాలు కూడా వేశారని తెలిపారు. ఇటీవల తాను ఓ కేసులో కోర్టుకు హాజరైనట్లు ఈ సందర్భంగా తెలిపారు. కేసులు, కోర్టులకు భయపడేదే లేదని ధీమా వ్యక్తం చేశారు.














