రేవంత్ పాలనలో “బుల్డోజర్ల రాజ్యం” : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
వరంగల్ టైమ్స్,హైదారాబాద్: రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని,పేదల ఇండ్లను కూల్చడమే పాలకులు ఒక పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రజాపాలన,ఇందిరమ్మ రాజ్యమంటూ పాలకులు ఊదరగొడుతున్నారని, వాస్తవానికిప్పుడు కొనసాగుతున్నది “బుల్డోజర్ల రాజ్యం” అని ఆయన దుయ్యబట్టారు. రామగుండంలో పేదల ఇండ్లను, మహబూబ్ నగర్ లో దివ్యాంగుల గూళ్లను, వెలుగుమట్లలో నిరుపేదల గుడిసెలను కూల్చారని,హైడ్రా పేరుతో పాలకులు విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు.
హైదారాబాద్ తెలంగాణ భవన్ లో వద్దిరాజు రవిచంద్ర సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు జాడే కనిపించట్లేది ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు పాలించడం రాక”డైవర్షన్ పాలిటిక్స్” చేస్తున్నారని, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ పేరుతో అపార్టుమెంట్లు, పక్కా ఇండ్లను నేలమట్టం చేసే ప్రయత్నాలు జరుగుతుండడం శోచనీయమన్నారు.
రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అధినేత రాహూల్ గాంధీ ఇక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితులపై దృష్టి సారిస్తే బాగుంటుందని ఎంపీ రవిచంద్ర హితవు పలికారు. ఎన్నికలకు ముందు రాహూల్, ప్రియాంకా గాంధీలు వరంగల్, కామారెడ్డి తదితర డిక్లరేషన్లను ఆర్భాటంగా ప్రకటించి, 432కుపైగా హామీలిచ్చారన్నారు. ఈ హామీల అమలు ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు.ఇస్తామన్న 2లక్షల ఉద్యోగాలలో ఇప్పటి వరకు భర్తీ జరిగిందెన్నో సమీక్షించాల్సిన బాధ్యత రాహూల్ గాంధీపై ఉందని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లినప్పుడు “బుల్డోజర్ రాజ్య్”అంటూ విమర్శించే రాహూల్ తాము పాలిస్తున్న తెలంగాణలో ప్రతినిత్యం బుల్డోజర్ల కింద పేదల బతుకులు చితికిపోవడం గురించి పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా జీవనం గడుపుతున్న పేదలపై పోలీస్ బలగాలతో విరుచుకుపడి గుడిసెలను నేలమట్టం చేయడంతో “ఇరాన్, గాజా”ల మాదిరి పరిస్థితి నెలకొన్నదని ఎంపీ వద్దిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. నిల్వ నీడలేక, ఆకలితో అలమటిస్తున్న బాధితులను బీఆర్ఎస్ తరఫున ఆదుకుంటుంటే ఓర్వలేని పాలకులు పోలీసులతో కొట్టిస్తున్నారని, అంబేడ్కర్ భవనం నుంచి తరిమికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
వెలుగుమట్లలో నెలకొన్న పరిస్థితులు, బాధితుల హృదయవిదారక బతుకులను కళ్లారా చూసేందుకు ఖమ్మంలో పర్యటించాల్సిందిగా మీడియా ద్వారా రాహుల్ గాంధీని ఆయన కోరారు. బాధితులకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీనిచ్చినట్లు తాము అధికారంలోకి వచ్చాక కట్టించి న్యాయం చేస్తామని ఎంపీ వద్దిరాజు చెప్పారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, గాంధీ నాయక్, బొమ్మెర రాంమూర్తి, డాక్టర్ కురవ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.















