కరోనా బారిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

కరోనా బారిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకోల్ కతా : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈమేరకు బీసీసీఐ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కరోనా పాజిటివ్ నిర్ధారణతో గంగూలీ కోల్ కతాలోని వుడ్ లాండ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉండటంతో సోమవారం గంగూలీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల గంగూలీని కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సంవత్సరం జనవరిలో గంగూలీ గుండె పోటుకు గురైన విషయం తెలిసిందే. దీంతో యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

ఈ యేడాది గంగూలీ ఆస్పత్రి పాలుకావడం ఇది మూడోసారి. ఈ యేడాది జనవరిలో ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకున్నారు. 20 రోజుల తర్వాత గుండెపోటు కారణంగా అదే నెలలో ఆస్పత్రిలో అడ్మిటై యాంజియోప్లాస్టీ చికిత్స చేయించుకున్నారు. రక్తనాళాలు బ్లాక్ కావడంతో రెండు స్టెంట్లు కూడా వేయించుకున్నారు. ఈ సంవత్సరం మార్చిలో కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. గతంలో గంగూలీ సోదరుడు, తల్లి కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.