2021లో నేరాల శాతం పెరిగింది : వరంగల్ సీపీ

2021లో నేరాల శాతం పెరిగింది : వరంగల్ సీపీవరంగల్ జిల్లా : వివిధ కారణాలతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది స్వల్పంగా నేరాల శాతం పెరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు సంబంధించిన వార్షిక నివేదికను గురువారం వరంగల్ ఖిలా కోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ వెల్లడించారు.

ఈ సమావేశంలో ముందుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికను సీపీ తరుణ్ జోషి, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఈ ఏడాది కాలంలో నేరాల వారిగా వివరాలను మీడియాకు తెలియజేశారు. 2020లో 10,622 నేరాలు నమోదు కాగా, ఈ యేడాది11,047 కేసులు నమోదయ్యాయని, గత యేడాదితో పోల్చుకుంటే 3.84 శాతంగా నేరాలు పెరిగాయని సీపీ తెలిపారు. ప్రధాన నేరాలకు సంబంధించి హత్యలు 17, దోపిడీలు 19, దొంగతనాలు, 238 అధికంగా జరిగినట్లు చెప్పారు.

ఈ ఏడాది మహిళలపై జరిగిన దాడులకు సంబంధించి మొత్తం 845 కేసులు నమోదు కాగా ఇందులో మహిళలపై వేధింపులకు సంబంధించి 200, అత్యాచారాలు 14, వరకట్నచావులు 3 వున్నాయి. రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే ఈ యేడాది 11 శాతం అధికంగా జరిగాయని, ఇందులో మొత్తం 1106 రోడ్డు ప్రమాదాల్లో 426 మంది మరణించగా, 1110 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొత్తం 11,980 కేసులు నమోదు కాగా, ఇందులో 1365మందిని జైలుకు పంపడంతో పాటు, రూ.65 లక్షల జరిమానాలు విధించినట్లు తెలిపారు.

2021లో నేరాల శాతం పెరిగింది : వరంగల్ సీపీ

పలుమార్లు నేరాలకు పాల్పడటంతో పాటు నేరాల నియంత్రణలో భాగంగా ఈ యేడాదిలో 60 మంది నిందితులపై పీడీ యాక్ట్ క్రింద కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 15 దొంగల ముఠాలకు సంబంధించిన 47మంది అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్టు చేయడం జరిగిందన్నారు.

అంతేకాకుండా వారి నుండి సుమారు కోటి పది లక్షల విలువ గల బంగారు, వెండి అభరణాలతో పాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం సీసీఎస్ పోలీసులు 98 కేసుల్లో 52 మంది నిందితులను పట్టుకోవడంతో పాటు, రూ. 97లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో సీసీఎస్ పోలీసుల పనితీరును సీపీ అభినందించారు.

ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పనితీరు అభినందనీయమని అన్నారు. ప్రస్తుత సంవత్సరంలో వివిధ రకాల కేసులకు సంబంధించి 270 కేసుల్లో 806 మంది నిందితులను అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ.4 కోట్ల 71 లక్షల విలువగల వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

కమిషనరేట్ పరిధిలో 98 గంజాయి కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఇందులో 249 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, కోటి రూపాయలకు పైగా విలువైన వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సీపీ తెలిపారు.ఈ యేడాది ఎక్కడా లేని విధంగా క్రికెట్ బెట్టింగ్ ల ముఠాను అరెస్టు చేసి రూ. 2 కోట్లలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీపీ వెల్లడించారు.

వచ్చే యేడాదిలో శాంతి భద్రత పరిరక్షణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి రహిత కమిషనరేట్ గా గుర్తింపు తీసుకరావడంతో పాటు ట్రాఫిక్ అదనపు డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళికతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఈస్ట్, వెస్ట్ జోన్ డీసీపీలు వెంకట లక్ష్మీ, సీతారాం లా అండ్ ఆర్డర్, అదనపు డీసీపీ సాయి చైతన్య, సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డీసీపీ పుష్పా రెడ్డి, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, భీంరావు, సంజీవ్ తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.