కేసీఆర్, మోడీకి రైతులే బుద్ధి చెప్తారు : పొన్నాల

కేసీఆర్, మోడీకి రైతులే బుద్ధి చెప్తారు : పొన్నాలహనుమకొండ జిల్లా : వ్యసనాలను నిర్మూలించే ప్రభుత్వాలను చూశాం కానీ, ప్రజల వ్యసనాలను ఆయుధంగా మార్చుకుని ఆదాయం పెంచుకుంటున్న ప్రభుత్వాన్ని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామని టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పాలనా తీరును ఆయన దుయ్యబట్టారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. సీఎం కేసీఆర్ వ్యవహార శైలి తాగండి.. ఊగండి అన్న చందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి వనరులు, ఆదాయం కల్పిస్తే, టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును చెప్పాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా ఓ ప్రక్క కరోనా థర్డ్ వేవ్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరిస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నూతన వేడుకల సందర్భంగా బార్లకు మాత్రం ఆంక్షలు పెట్టకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు మద్యానికి బానిసైనా పర్వాలేదు కానీ, మద్యం ఆదాయమే ఎక్కువ అని మండిపడ్డారు.

ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల పట్ల పట్టింపే లేదని ఆరోపించారు. యాసంగిలో వరి వేయడం, ఉరి వేసుకోవడమే అని రైతులకు హిత బోధ చేసిన సీఎం కేసీఆర్, తాను మాత్రం 150 ఎకరాల్లో వరి పంట వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతుల విషయంలో డ్రామాలు చేస్తున్న సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలకు రానున్న రోజుల్లో రైతుల ఉరి వేస్తారని పొన్నాల హెచ్చరించారు. అనంతరం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ఈ.వి. శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ జిల్లా, నగర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.