నడిరోడ్డుపై గుట్టలుగా కరెన్సీ తుక్కు

నడిరోడ్డుపై గుట్టలుగా కరెన్సీ తుక్కు
నిజామాబాద్ జిల్లా : హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై నోట్లు గుట్టలుగా దర్శనమిచ్చాయి. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డుపై గుట్టలుగా పడి ఉన్న చిరిగిన నోట్లు కలకలం రేపాయి. నడిరోడ్డుపై గుట్టలుగా పడివున్న వాటిని చూసిన జనం షాకయ్యారు.

అవి అక్కడికి ఎలా వచ్చాయి? తుక్కుగా ఎలా మారాయి? అన్న విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. నోట్ల కట్టలున్న సంచి లారీ పైనుంచి కిందపడి ఉంటుందని, దానిపై నుంచి వాహనాలు వెళ్లడంతో నోట్లన్నీ ఇలా చినిగిపోయి ఉంటాయని భావిస్తున్నారు.

వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? అవి అసలైనవా? లేక, నకిలీవా? ఒకవేళ అసలైనవే అయితే ఇలా ఎందుకు తుక్కుగా మార్చారు? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రిజర్వు బ్యాంకు ఇలా చేసే అవకాశం లేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

పాత నోట్లను అది రహస్య ప్రదేశంలో కాల్చివేస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఇది నల్లధనం కానీ, నకిలీ నోట్లు కానీ అయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నోట్లున్న సంచి ఏ వాహనం నుంచి జారిపడిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.