టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు

టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధున్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన ఖాతాలో మరో టైటిల్ కైవసం చేసుకుంది. నేడు జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్-2022 మహిళా సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లో సింధు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి మాల్విక బన్సోద్ ను రెండు వరుస సెట్లలో 21-13, 21-16 స్కోర్లతో ఓడించింది. సింధూ దూకుడుతో కేవలం 35 నిమిషాల్లోనే మ్యాచ్ పూర్తైంది. బాబు బనారసి ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. 26 యేండ్ల పీవీ సింధు రెండు సార్లు ఒలింపిక్స్ పతకం సాధించింది. ఆట ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఎక్కడా చాన్స్ ఇవ్వకుండా సులభంగా తొలి సెట్ ను గెలుచుకుంది. రెండో సెట్ లోనూ అదే దూకుడును కొనసాగించి మ్యాచ్ గెలిచింది.

అయితే, ఇదే టోర్నమెంట్ లో పురుషుల సింగిల్స్ మ్యాచ్ రద్దైంది. ఆ మ్యాచ్ లో తలపడాల్సిన ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు టోర్నీ నిర్వహకులు తెలిపారు. ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ అర్నాడ్ మెర్కెల్, లూకాస్ క్లేయర్ బౌట్ మధ్య జరుగాల్సి ఉండే. అయితే ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలిందని బీడబ్ల్యూఎఫ్ నేడు ఉదయం ప్రకటించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.