ఎదురుకాల్పులు..4గురు మావోలు హతం

ఎదురుకాల్పులు..4గురు మావోలు హతంహైదరాబాద్ : తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజీ అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నట్లు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను కూడా తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. సీనియర్ మావోయిస్టు సుధాకర్ తో పాటు 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. వీరంతా పేరూరు, ఇల్మిడి, ఊసూరు పోలీసు స్టేషన్ల పరిధిలోని ఓ కొండ ప్రాంతంలో ఉన్నట్లు పోలీస్ బలగాలకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా నుంచి డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులను పట్టుకునేందుకు నిన్న సాయంత్రం బయల్దేరారు.

కూంబింగ్ లో భాగంగా మంగళవారం ఉదయం 7 గంటలకు బీజాూర్ లోని సీమల్ దొడ్డి గ్రామం, తెలంగాణలోని పెనుగోలు గ్రామ సరిహద్దుల వద్ద బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్స్ కు చెందిన ఒక జవాను గాయపడటంతో, చికిత్స నిమిత్తం హెలికాప్టర్ లో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ జవానుకు డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. జవాను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

ఇక దక్షిణ బస్తర్ దంతేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ ప్రాంతాల్లో 20 నుంచి 25 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించారు. ఈక్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను మున్నిగా పోలీసులు గుర్తించారు. ఆ ఏరియాలో కూంబింగ్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.