ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల డీఏ చెల్లింపుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల(కరువు భత్యం) కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10.01 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక, సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉచిత విద్యతో పాటు ఇంగ్లీషు బోధనపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం తీసుకు రావాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చించి పూర్తి విధి విధానాలపై సమగ్ర నివేదికను రూపొందించనున్నారు.