సాయం చేయడంలో తగ్గేదే లేదన్న ఆ మంత్రులెవరూ ?

సాయం చేయడంలో తగ్గేదే లేదన్న ఆ మంత్రులెవరూ ? వరంగల్ జిల్లా : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ‌త రెండు మూడు రోజుల‌పాటు కురిసిన అకాల వ‌డ‌గండ్ల వ‌ర్షాల వ‌ల్ల ఏర్పడిన పంట నష్టాలను రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు బృందం పరిశీలించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నియోజకవర్గాలలో ఏర్పడిన పంట నష్టాలను రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు లతో పాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు పలునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, శంక‌ర్ నాయ‌క్‌, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, కలెక్టర్ పరిశీలించారు..

కన్నీళ్లు పెట్టుకున్న రైతులు, భరోసా ఇచ్చిన ప్రజాప్రతినిధులు
మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు క్షేత్ర స్థాయికి వెళ్ళి పంట‌ల న‌ష్టాల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. రైతుల‌తో నేరుగా మాట్లాడారు. పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో నష్టాలపాలైన పంటలను క్షేత్రస్థాయి పరిశీలించిన మంత్రులు ఎదుట బాధిత రైతులు కన్నీళ్లపర్యంతమయ్యారు. చేతికొచ్చిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని వేడుకున్నారు. దీంతో బాధిత రైతులను మంత్రులు , స్థానిక ఎమ్మెల్యేలు ఓదార్చారు.
సాయం చేయడంలో తగ్గేదే లేదన్న ఆ మంత్రులెవరూ ?

మేమున్నామంటూ ధైర్యం కల్పించారు. ఏయే పంట‌లు వేశారు. ఎంత మేర‌కు న‌ష్టం ఉంటుంద‌ని అడిగి తెలుసుకున్నారు. వారికి మ‌నో ధైర్యం క‌ల్పించారు. ఇప్ప‌టికే రైతుల‌కు పంట‌ల పెట్టుబ‌డి ఇస్తున్న సీఎం కేసీఆర్‌ వెంట‌నే పంట‌ల న‌ష్టాల‌ను ప‌రిశీలించి, నివేదిక ఇవ్వ‌మ‌న్నార‌ని, ఆ నివేదిక ఆధారంగా ప‌రిహారం కూడా అందుతుంద‌న్న భ‌రోసాని క‌ల్పించారు. తాము రాజ‌కీయాల‌కు రాలేద‌ని అన్నారు. పంట‌లు న‌ష్ట‌పోయిన ప్ర‌తీ రైతును రాజ‌కీయాల‌క‌తీతంగా ఆదుకుంటామ‌ని అన్నారు.` ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సాయం చేయడంలో వెనక్కి తగ్గేదే లేదని వారు స్ప‌ష్టం చేశారు. అనంత‌రం న‌ర్సంపేట‌లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా తాజా వ్య‌వ‌సాయ ప‌రిస్థితులు, పంట‌ల న‌ష్టాలు, వాటి అంచ‌నాలు, ప్రాథ‌మిక నివేదిక‌లు, ప్ర‌త్యామ్నాయ పంట‌లసాగు వంటి ప‌లు అంశాల‌పై `మంత్రుల‌తోపాటు ప్ర‌జాప్ర‌తినిధులంతా క‌లిసి సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచనలు..
అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు ధైర్యం చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఏం పంటలు వేసుకుంటారో రైతులను అడిగి తెలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులను ఆదుకుంటామని, న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకుంటామని అన్నారు. అలాగే, ఇప్పుడు న‌ష్ట‌పోయిన రైతులు, ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌పై దృష్టి పెట్టాల‌ని, అధికారులు ఆ విధంగా రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి ప్రోత్స‌హించాల‌ని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

పనికిరాని పీఎం ఫసల్ భీమా యోజన : మంత్రి నిరంజన్ రెడ్డి
ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన అమలుతో ప్రయోజనం లేదు. ఈ పథకంలో ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు ఇచ్చిన భీమా కన్నా కట్టిన ప్రీమియం ఎక్కువ. దాదాపు రూ.400 కోట్లు భీమా కంపెనీలకు అదనంగా చెల్లించడం జరిగింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కూడా ఈ పథకం అమలు నుండి వైదొలిగింది. క్షేత్రస్థాయిలో రైతులకు ఈ విషయం వివరించి చెప్పాలి. రైతు వ్యవసాయ క్షేత్రం కేంద్రంగా భీమా చెల్లించే విధానం రావాలి అని అన్నారు. అది లాభదాయకం కాదు కాబట్టి కంపెనీలు ఒప్పుకోవు. నష్టపోయిన రైతులకు పంట కాలం పోకుండా వెంటనే ఏఏ పంటలు వేసుకుంటారో నివేదిక ఇవ్వాలి. నిజంగా నష్టపోయిన వారికే న్యాయం జరగాలి. పంట నష్టం నమోదులో అవకతవకలకు తావివ్వద్దు. మంత్రి నిరంజ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వానాకాలం రైతుల ధాన్యం మొత్తం కొంటున్నాం. కాని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు.

రైతులు అధైర్య పడొద్దు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రైతులు అధైర్య ప‌డొద్దు, మీకు అండ‌గా సీఎం కేసీఆర్, మేమున్నామని మంత్రి దయాకర్ రావు అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాథ‌మిక అంచ‌నా మాత్ర‌మే జ‌రిగింది. ఇంకా పూర్తి స్థాయి అంచ‌నా చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. నివేదిక‌లు రాగానే సీఎం కేసీఆర్ త‌గు నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలిపారు. న‌ష్ట‌పోయిన ప్ర‌తీ రైతుకు న్యాయం జ‌ర‌గాలి. కొంత స‌మ‌యం తీసుకున్నా స‌రే, అంచనాలు మాత్రం చాలా స్ప‌ష్టంగా ఉండాలి. ఎలాంటి ఆరోప‌ణ‌ల‌కు తావు లేకుండా అధికారులు క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌లు చేసి నివేదిక‌లు అంద‌చేయాలి. అన్నారు.

రైతాంగానికి అండ‌గా ఉన్న‌ది కేవలం సీఎం కేసీఆర్ మాత్ర‌మే. రైతుల మేలు కోరి, ఇత‌ర రాష్ట్రాల్లో లేని విధంగా పంట‌ల పెట్టుబ‌డి, రుణ మాఫీ, ఉచిత విద్యుత్‌, అందుబాటులో విత్త‌నాలు, ఎరువులు, సాగునీరు, పంట‌ల దిగుబ‌డుల నిలువ‌ల మీద బీమా, రైతుల‌కు బీమా ఇలా ఎక్క‌డా లేని విధంగా పంట‌ల‌ను కొనుగోలు చేయ‌డం వ‌ర‌కు మొత్తం ప్ర‌భుత్వమే చేస్తున్న‌ద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు. రైతుల‌కు సీఎం కేసీఆర్ పూర్తిగా న్యాయం, సాయం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని రైతాంగానికి భ‌రోసా క‌ల్పించారు. పంట‌ల న‌ష్టం జ‌రిగిన ప్రాంతాల్లో స్త్రీ నిధి కింద రుణాలు పొందిన రైతుల కుటుంబాల డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణాల చెల్లింపుల‌పై స‌మ‌యం ఇవ్వ‌డం వంటి అంశాల‌ను ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. సంబంధిత అధికారుల‌తో మాట్లాడి, త‌గు విధంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో సంబంధిత అధికారులు, ప‌లువురు రైతులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ పార్టీల నేత‌లు సైతం పాల్గొని త‌మ విజ్ఞాప‌న‌ల ద్వారా ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు.