మావోయిస్ట్ నేత రైను అరెస్ట్
వరంగల్ టైమ్స్ , విశాఖ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీకి చెందిన కీలక మావోయిస్టు నేత, డివిజనల్ కమిటీ సభ్యుడు జనుమూరి శ్రీనుబాబు అలియాస్ రైను అలియాస్ సునీల్ ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ నెల 21న మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల సమయంలో రైనును అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రైను నుంచి ఒక తుపాకీ, పేలుడు సామాగ్రి, విప్లవ సాహిత్యం, నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 2018లో అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము హత్య కేసులో ఇతన ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతగా ఉన్నాడని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం ఇతనిపై రూ. 5లక్షల రివార్డు ప్రకటించిందని తెలిపారు.
రైను 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరి ఎల్లవరం, గుర్తేడు, నందపూర్ దళాల్లో పనిచేశాడని తెలిపారు. ఎఓబి టెక్నికల్ టీంలో, సీఆర్సీ 3వ కంపెనీలో కమాండర్ గా, ఆర్కే ప్రొటెక్షన్ స్క్వాడ్ కమాండర్ గా, ఎఓబీ మిలిటరీ ప్లటూన్ కమాండర్ గా వివిధ హోదాల్లో పనిచేసినట్లు వెల్లడించారు.