టీడీపీ నేత వినోద్ ను ఉరి తీయాలి: వాసిరెడ్డి పద్మ

కీచక టీడీపీ నేత వినోద్ జైన్ ను ఉరి తీయాలి
లైంగిక వేధింపులతో విద్యార్ధిని ఆత్మహత్య ఘటనపై వాసిరెడ్డి పద్మ ఫైర్
ప్రభుత్వాసుపత్రి మార్చురి వద్ద బాధితురాలి బంధువుల పరామర్శ
నేరస్తుడికి శిక్ష పడే వరకు అండనిస్తామని హామీ
మహిళల పట్ల టీడీపీ వైఖరి స్పష్టతపై వాసిరెడ్డి పద్మ ఘాటైన ప్రశ్నలు

టీడీపీ నేత వినోద్ ను ఉరి తీయాలి: వాసిరెడ్డి పద్మ

విజయవాడ : తొమ్మిదో తరగతి చదువుతున్న 14యేండ్ల విద్యార్ధినిని లైంగికంగా వేధించి ఆత్మహత్యకు పురిగొల్పిన టీడీపీ నేత వినోద్ జైన్ ను ఉరితీసినా తప్పేమీ కాదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం విజయవాడలోని భవానిపురం కుమ్మరపాలెం సెంటర్ లో బాలిక ఆత్మహత్య ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరి వద్ద మృతురాలి బంధువులతో వాసిరెడ్డి పద్మ మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మగవాడి దౌర్జన్యాన్ని తట్టుకోలేక, వేధింపులు తాళలేక బాలిక గౌరీ దీక్షిత ఆత్మహత్యకి పాల్పడిందన్నారు. టీడీపీ కార్పొరేటర్ గా పోటీచేసిన కీచకుడు వినోద్ జైన్ దుర్భుద్ధి కారణంగా ఒక మల్టీ టాలెంటెడ్ బాలిక బలైందన్నారు. కుటుంబానికి చెప్పుకోలేని స్థితిలో బాలిక గౌరి భయపడి మేడమీద నుంచి దూకిందంటే వినోద్ జైన్ ఏమేరకు వత్తిడి చేశారనేది వెలుగులోకి రావాలన్నారు.

కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంలో టీడీపీ నేతల పేర్లు వచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదని వాసిరెడ్డి పద్మ అన్నారు. బాధితురాలి లేఖ చూసేవరకు వాస్తవం బయటకు రాలేదని అన్నారు. రెండు నెలలుగా శరీరాన్ని తాకుతూ ఇబ్బంది పెట్టాడని, అతని గురించి చెప్పినా ఎవరూ నమ్మరు అని భావించే బాలిక ఆత్మహత్యకి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగికంగా ఎన్నోసార్లు ఇబ్బందులకు గురి చేసినట్టు పాప లేఖలో రాసిందని చెప్పారు. టీడీపీలో వినోద్ జైన్ లాంటివాళ్ళు ఎంతోమంది ఉన్నారని, వినోద్ ఒక్కడే దొరికిన దొంగగా పట్టుబడ్డాడని ఆరోపించారు. రాష్ర్టంలో మహిళా సాధికారతకు అహరహం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఒంటికాలితో విమర్శిస్తున్న టీడీపీ.. ఇలాంటి ఘటనలపై ఏ విధంగా స్పందిస్తారని నిలదీశారు. ఈసారి టీడీపీ నేతలు బయటకు వచ్చేముందు మహిళా లోకానికి చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.టీడీపీ నేత వినోద్ ను ఉరి తీయాలి: వాసిరెడ్డి పద్మసుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు అనేకసార్లు మహిళలను అవమానించారని, నటుడు, ఎమ్మెల్యే బాలక్రిష్ణనేమో ఆడది కనబడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని వ్యాఖ్యలు చేశారని ఆమె గుర్తు చేశారు. టీడీపీ హయాంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అప్పట్లో మహిళా కమిషన్ కంటితుడుపు చర్యలకు పాల్పడితే, ప్రస్తుత మహిళా కమిషన్ నేరస్తులను కఠినంగా శిక్షించేవరకు పోరాడుతుందన్నారు. టీడీపీకి ఆ పార్టీ నేతలపై కంట్రోల్ లేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటన పట్ల తీవ్రంగా కలత చెందారన్నారు. ఎక్కడ ఆడపిల్ల ఆర్థనాదం విన్నా పోలీసులు ప్రత్యక్షమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వాసిరెడ్డి పద్మ అన్నారు.

కుటుంబ సాన్నిహిత్యాన్ని అడ్డంపెట్టుకుని పసిపాపపై అకృత్యానికి పాల్పడిన వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలన్నారు. అలాంటి వ్యక్తిని ఉరి వేసినా తప్పు లేదన్నారు. టీడీపీ కార్యాలయం వద్దే లోకేష్ టీమ్ లైంగికంగా వేధించినందుకు ధర్నా చేస్తున్నారని… లోకేష్ పీఏ వేధింపులతో బాధిత మహిళకు సమాధానం చెప్పడంలో ఆ పార్టీ నేతలు నోరుమెదపకపోవడంలో ఆంతర్యమేం టన్నారు. మహిళల పట్ల టీడీపీ అధిష్టానం ముందు వాళ్ల వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతల్లో మార్పు రాకపోతే… కిందటి ఎన్నికలలో 23 సీట్లకే పరిమితం చేసిన మహిళలు టీడీపీని భూస్థాపితం చేస్తారని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.