పట్టుబడితే పీడీ యాక్ట్ కేసులే : మంత్రి శ్రీనివాస్

పట్టుబడితే పీడీ యాక్ట్ కేసులే : మంత్రి శ్రీనివాస్హనుమకొండ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి, బైండోవర్ చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నక్కలగుట్టలోని కాకతీయ హరిత హోటల్ లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ , పోలీస్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

గంజాయి సాగు చేస్తున్న రైతులు, పండిస్తున్న భూముల వివరాలను వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉమ్మడి వరంగల్ జిల్లాను గంజాయి రహితంగా మార్చాలని శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, విద్యాసంస్థల నిర్వాహకులకు ఆబ్కారీ శాఖ, పోలీస్ శాఖల అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సూచించారు.

పట్టుబడితే పీడీ యాక్ట్ కేసులే : మంత్రి శ్రీనివాస్

అక్రమ గంజాయి సాగుకు, రవాణాకు పాల్పడినా, వారికి సహకరించే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. అలాంటి వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసిన అధికారులకు ప్రభుత్వం తరపున అవార్డులను అందించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో గంజాయి సాగు చేస్తున్న వారిని యువకులు, ప్రజాప్రతినిధులు సామాజిక బాధ్యతగా భావించి ఆబ్కారీ, పోలీస్ శాఖల అధికారులకు సమాచారం అందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.

రైల్వే, బస్ లలో గంజాయి రవాణా కాకుండా సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ వరంగల్ జిల్లా సూపరిటెండెంట్ శ్రీనివాసరావు, శంషాబాద్ సూపరిటెండెంట్ సత్యనారాయణ, ఏఈఎస్ కరమ్ చంద్, హనుమకొండ పోలీస్ శాఖ ఏసీపీ జితేందర్ రెడ్డి, సుబేదారి పోలీసు సీఐ రాఘవేంద్ర, హన్మకొండ ఆబ్కారీ శాఖ సీఐ రామకృష్ణ, పోలీసు, ఆబ్కారీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.