మణికొండ భూముల కేసులో సుప్రీం సంచలన తీర్పు

మణికొండ భూముల కేసులో సుప్రీం సంచలన తీర్పువరంగల్ టైమ్స్ , న్యూఢిల్లీ : హైదరాబాద్ లోని మణికొండ జాగీర్ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1654.32 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తం భూములపై సర్వ హక్కులు తెలంగాణ ప్రభుత్వానివే అని సుప్రీం వెల్లడించింది.

ఈ తీర్పుతో ఎన్నో యేండ్లుగా ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు మధ్య వివాదానికి తెరపడింది. ఈ భూముల విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. 2012, ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. 156 పేజీల తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా బెంచ్ సోమవారం వెలువరించింది.

ఇనామ్ భూముల చెల్లింపులు పెండింగ్ ఉంటే 6 నెలల్లో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. భూముల స్వాధీనంలో వక్ఫ్ బోర్డు ఇష్టారీతిలో వ్యవహరించడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. వక్ఫ్ భూములని భావిస్తే ఆధారాలతో నోటీసులు ఇవ్వాలని కోర్లు సూచించింది. సర్వే నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించింది. భూములు వక్ఫ్ బోర్డువని తేలితే రూ.50వేల కోట్లు కడుతామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.