స్థలాల క్రమబద్ధీకరణకు గడువు పెంపు

స్థలాల క్రమబద్ధీకరణకు గడువు పెంపు  స్థలాల క్రమబద్ధీకరణకు గడువు పెంపు

warangaltimes, హైదరాబాద్ : నగరాల్లో చాలాకాలంగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు తెలంగాణ సర్కార్ మరో ఛాన్స్ కల్పించింది. వారికి హక్కులు కల్పించేందుకు మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. పేదల భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారికి అదే విధంగా సింగరేణి సంస్థకు చెందిన భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారికి కూడా మరోసారి క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించింది.

పేదల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జీవో 58, జీవో 59 కింద భూముల క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. కటాఫ్ తేదీని సైతం 2020 జూన్ 2 వరకు పొడిగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ శుక్రవారం జీవో నంబర్ 28, 29 జారీ చేసింది. పట్టణాల్లోని భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు 30 రోజులు అవకాశం ఇవ్వగా, సింగరేణి పరిధిలో దరఖాస్తులకు 3 నెలలు అవకాశం ఇచ్చింది.

ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో జీవో 58, 59 కింద పట్టణ పేదలకు మరోసారి అవకాశం కల్పించాలని, కటాఫ్ తేదీని పొడిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని భావించినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. శుక్రవారం కోడ్ ఎత్తివేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల , పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూములు ఆక్రమించుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అంటే 2014 జూన్ 2 వరకు పట్టణాల పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నవారికి శాశ్వత హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2014 డిసెంబర్ 30న జీవో 58, 59ను విడుదల చేశారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించారు.

వివిధ కారణాల వల్ల కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారని గుర్తించిన ప్రభుత్వం గత యేడాది ఫిబ్రవరిలో మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నది. సింగరేణి పరిధిలోనూ జీవో 58, 59 కింద 2014లో ఒకసారి, 2019లో మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించింది. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించారు.

ఇలా ఇప్పటివరకు జీవో 58 కింద 1,45,668 మంది పట్టాలు పొందారు. జీవో 59 కింద 42 వేల మందికి వారి ఇండ్లపై హక్కులు సంక్రమించాయి. తాజాగా పేదలకు మరోసారి దరఖాస్తులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కటాఫ్ తేదీని ఆరేండ్లు పొడిగించింది. 2014 జూన్ 2 నుంచి 2020 జూన్ 2 కి మార్చింది. ఈ నిర్ణయంతో లక్షల మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగనుంది.

అయితే క్రమబద్ధీకరణకు కొత్త కటాఫ్ తేదీ 2020, జూన్ 2 వరకు, పట్టణాల్లో దరఖాస్తుల గడువు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు , సింగరేణి పరిధిలో ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పొడిగించింది.