అమరావతి : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని గురువారం మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగించారు. అర్థరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీమలయప్పస్వామివారిని స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగించారు. ఈ రథోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, తదితర ప్రముఖులు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు.
గురువారం సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవను నిర్వహిస్తున్నారు. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో కలిసి తిరుచ్చిపై మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర ముక్కోటి తిరుమలలో ఏకాంతంగా జరుపనున్నారు. శ్రీవారి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంతో పాటు, ప్రధాన కూడళ్లలో విద్యుద్దీకరణ పనులను చేపట్టారు.