తెలంగాణలో సభలు, ర్యాలీలపై నిషేధం: డీజీపీ

తెలంగాణలో సభలు, ర్యాలీలపై నిషేధం: డీజీపీహైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్, ఒమిక్రాన్ నియంత్రణలో భాగంగా జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ కమీషనర్లకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.

కొవిడ్ నిబంధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ ఒక్కరు విధిగా మాస్కులను ధరించడంతో పాటు, సామాజిక దూరం పాటించాలనే అంశాల పట్ల ప్రజలను, చైతన్య వంతులను చేస్తున్నామని పేర్కొన్నారు.

బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వారికి నిబంధనలను అనుసరించి రూ.1000 ఫైన్ ను విధిస్తామని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరు కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

అనుమతి పొందిన కార్యక్రమాలలో విధిగా కొవిడ్ నియమ, నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను కోరినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.