మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభించిన హరీష్ రావు

మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభించిన హరీష్ రావువనపర్తి జిల్లా : వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వనపర్తిలో రూ.17 కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్యకేంద్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రహదారుల విస్తరణ ఎంతో ఇబ్బందితో కూడుకున్నదని ఆయన తెలిపారు.

సిద్దిపేటలో ఒక్క సుభాష్ రోడ్ విస్తరణకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసని, దానికి యేడాదిన్నర సమయం పట్టిందని హరీష్ రావు గుర్తు చేశారు. వనపర్తిలో 6 రహదారులు 4 లేన్లుగా విస్తరణ అంటే ఎంత కష్టపడాలో తనకు తెలుసన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి కృషిని కొనియాడారు. కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులు, తన సహకారం సంపూర్ణంగా ఉంటుందన్నారు.

కేసీఆర్ కిట్ రాకతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 54 శాతం కాన్పులు పెరిగాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. దేశంలో తెలంగాణ ఉత్తమ సేవలు అందిస్తున్న రాష్ట్రంగా కేంద్రం గుర్తించింది. తెలంగాణలో రూ.407 కోట్లతో 23 ప్రసూతి ఆస్పత్రులు, రూ.30 కోట్లతో ప్రసూతి గదుల నిర్మాణం జరుగుతుందన్నారు. పుట్టిన పిల్లల కోసం ఎస్ఎన్ సీయూ కేంద్రాలను 7 యేండ్లలో 65 కి పెంచామని పేర్కొన్నారు. శిశు మరణాలను 25 శాతం నుంచి 16 శాతానికి తగ్గించాం.. జాతీయ సగటు 22 శాతంగా ఉంది..ఇక ప్రణాళికతో ప్రజలకు వైద్యారోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చామంటే సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లనేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

రూ.1500 కోట్లతో 3 మెడికల్ కాలేజీలు..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రూ.1500 కోట్లతో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూలులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాలలో ఒక్కొక్కటి రూ. 50 కోట్లతో నర్సింగ్ కాలేజీల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఇక 15 నుంచి 17 యేండ్ల పిల్లలకు 90 శాతం మందికి వ్యాక్సిన్ వేసి వనపర్తి జిల్లా అగ్రభాగంలో నిలిచిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఫీవర్ సర్వేకు సహకరించాలని కోరారు. కోటి 27 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు రాష్ట్రంలో పంపిణీ చేశామన్నారు. 2 కోట్ల కరోనా పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు.