27న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకై రౌండ్ టేబుల్ మీటింగ్

27న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకై రౌండ్ టేబుల్ మీటింగ్

హనుమకొండ జిల్లా : ఉద్యమస్ఫూర్తితో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకై ఉద్యమిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ నగరంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో సీపీఐ నాయకులతో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ భేటీ అయ్యారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకై తాము చేపట్టబోతున్న ఐక్య ఉద్యమానికి సీపీఐ మద్దతు తెలపాలని సీపీఐ నాయకులను ఈ సందర్భంగా దాస్యం కోరారు. తమ పోరాటంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీల నాయకులు జనవరి 27న కాజీపేట ప్యారడైజ్ ఫక్షన్ హాల్ లో రౌండ్ సమావేశానికి హాజరుకావాలని వినయ్ భాస్కర్ కోరారు. ‘మాటలు కోటలు దాటుతాయి..కాళ్లు తంగేళ్లు దాటవు’ అన్న సామెత బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా విభజన చట్టంలోని హామీల్లో ఒక్కటి కూడా కేంద్రం నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు.

ఇందులో భాగంగానే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మరియు విభజన చట్టంలోని హామీలకు భారీగా నిధులు కేటాయించాలని దాస్యం డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే అబద్దపు ప్రచారాలు, దొంగ లేఖలు మాని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి రావాలసిన నిధులు, విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక గల్లీలలో తిరిగే బీజేపీ నాయకులకు నగరంపై ప్రేమ ఉంటే ఢీల్లీలో బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించి కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెప్పించడానికి కృషి చేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హితవు చేశారు.

ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కళపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి రవి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనిల్, సమాద్, ఇతర టీఆర్ఎస్ పార్టీ మరియు సీపీఐ నాయకులు పాల్గొన్నారు.