హైదరాబాద్ : ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో దేవదాసి పాత్రలో సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక వార్త ప్రచురితం చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఓ టాలెంటెడ్ నటిపై బాడీ షేమింగ్ చేయడం మంచి పద్దతి కాదని చాలామంది దీన్ని ఖండించారు. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. సాయిపల్లవిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలకు పాల్పడటం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓ తమిళ ఛానల్ లో గవర్నర్ తమిళిసై మాట్లాడారు.
‘నేను కూడా నా రూపం పట్ల చాలాసార్లు ట్రోలింగ్ కు గురయ్యాను. అయితే అలాంటి వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఎగతాళి చేసే వారికి ఏం తెలుస్తుంది, ఆ మాటలు ఎదుటివారిని ఎంతగా బాధిస్తాయో. అలాంటి వ్యాఖ్యలకు నేను చాలా బాధపడ్డాను. కానీ ప్రతిభ, శ్రమతో వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నా’. ‘ పొట్టిగా, ముదురు రంగుతో నాలాంటి జుట్టుతో పుట్టడం తప్పుకాదు. వీటన్నింటిలోనూ అందం ఉంది. అందుకే కాకి తన పిల్లను ఎంతో ముద్దుగా చూసుకుంటుంది. అంతేకానీ నల్లగా ఉందని వదిలిపెట్టదు.
ఈ సమాజంలో ఎక్కువగా స్త్రీలే బాడీ షేమింగ్ కు గురవుతుంటారు. పురుషులను మాత్రం 50 యేళ్ల వయసులో ఉన్నా యువకుల్లాగే చూస్తుంటారు. మహిళల ఎదుగుదలను ఆపలేని ఈ సమాజం వారిని బాధపెట్టడం ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. ట్రోలింగ్ బాధిస్తుందా అని అడిగితే , ఖచ్ఛితంగా అని చెబుతా. అందుకే స్త్రీలు ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవడం మానేసి మానసికంగా బలంగా మారాలి’ అని గవర్నర్ తమిళిసై చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించి వీడియోను ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
నేచురల్ స్టార్ నాని డ్యుయల్ రోల్ లో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి తన నటన, డ్యాన్సులతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.