మేడారం జాతరలో ఏర్పాట్లు భేష్

మేడారం జాతరలో ఏర్పాట్లు భేష్

వరంగల్ టైమ్స్,ములుగు జిల్లా: ప్రతీ రెండేళ్లకోకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలను గౌరవిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. జాతర నిర్వహణకు ఏర్పాట్లకు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరి చేసి తాత్కాలిక , శాశ్వత పనులు చేపట్టింది.

త్రాగు నీరు, మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారుల అభివృద్ధి , క్యూలైన్ ఏర్పాటు తదితర అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసింది. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అనేక మార్లు పర్యటించి గత జాతర అనుభవాలను పరిగణనలోకి తీసుకొని లోపాలను సరిదిద్దుకుంటూ ఏర్పాట్లను విస్తృత పరిచారు.

భక్తులకు సజావు దర్శనమే లక్ష్యంగా జిల్లా, రాష్ట్ర యత్రాంగాలు ప్రత్యేక దృష్టి సారించి పక్కా ప్రణాళికతో జాతరకు ముందే అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేశారు. జాతర విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జాతరకు ముందు ఏర్పాట్ల పరిశీలనకు రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం జాతరకు ఇచ్చిన ప్రాముఖ్యత స్పష్టం అవుతోంది. చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, మంత్రులు పలుమార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించారు.

జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు అనేకమార్లు పర్యటించి వివరాలను తెలుసుకున్నారు. మొత్తంగా భక్తులకు అసౌకర్యం లేకుండా మేడారం ను ముస్తాబు చేశారు. వాహనాల పార్కింగ్ స్థలాలు గద్దెల కు దూరంగా ఏర్పాటు చేయడం, రోడ్ల వెడల్పు, నూతన రోడ్లు, మరమ్మత్తులు , రవాణా వ్యవస్థను నియంత్రించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంలో యంత్రాంగం సఫలీకృతులయ్యారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కొరకు ఏర్పాటు చేసిన వసతి షెడ్ల పట్ల భక్తులలో సంతోషం కనపడుతోంది.

జాతర మొత్తంలో ఎల్ ఈ డీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణను పర్యవేక్షించేందుకు సిసి కెమెరాలు, 10 డ్రోన్ కెమెరాలను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీటితో సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ నిఘాలో రాత్రి పగలు పర్యవేక్షిస్తున్నారు. మేడారం ఆలయ పరిసర ప్రాంతాలను 8 జోన్లు, 37 సెక్టార్లు, 60 సబ్ సెక్టర్లుగా విభజించి సెక్టార్ల వారీగా అధికారులు సిబ్బందిని నియమించి భక్తులకు ఎక్కడా అంతరాయం కలగకుండా మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. సెక్టోరల్ అధికారులకు ఇచ్చిన వాకిటాకీ ద్వారా వివరాలు తెలుసుకుంటూ సమస్యలు ఉంటే పరిష్కరిస్తూ జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్తోంది. దాదాపు 1200 మంది ఉద్యోగులకు మేడారం విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల తాకిడి అంచనా వేసి యత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.

శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు :

ఆర్ అండ్ బి శాఖ : మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కొరకు ఈ శాఖ ద్వారా రూ.13 కోట్లతో రహదారుల నిర్మాణం, రోడ్డు వెడల్పు, మరమ్మత్తులతో పాటు అతిధి గృహం, సమావేశ మందిరం నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు.

పంచాయితీ రాజ్ శాఖా : కోట్ల మంది వచ్చే జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధాన ఛాలెంజ్. అంటువ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య కార్మికుల చేస్తున్న సేవలు ఎనలేనివి. డంపింగ్ యార్డుల నిర్మాణం చేపట్టి చెత్త తరలింపుకై 4000 మంది పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా పొరుగు రాష్ట్రం నుండి రప్పించారు. జాతర సనయంలోనే కాకుండా జాతర అనంతరం పరిసర ప్రాంతాలను పరిశుభ్రం గా ఉండే విధంగా చర్యలు చేపట్టారు.

నీటిపారుదల శాఖ : జంపన్న వాగు ప్రాశస్త్యం తెలియంది కాదు. మేడారం వచ్చే భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి తల్లుల దర్శనానికి తరలి వెళ్తారు. నీటిపారుదల శాఖ ఆరు కోట్ల రూపాయలతో విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. ఇప్పటికే జంపన్న వాగులో ఉన్న స్నానఘట్టాలకు మరమ్మతులు చేయడం తో పాటు నూతన స్నాన ఘట్టాల నిర్మాణం, 354 బ్యాటరీ నల్లాల ఏర్పాటు, రెండు ఇన్ ఫిల్టరేషన్ బావులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు జంపన్న వాగు 3.5 కిలోమీటర్ల పొడవునా 132 ప్రత్యేక కంపార్టుమెంట్ల నిర్మాణం తదితర పనులను భక్తుల కొరకు చేపట్టింది.

గిరిజన సంక్షేమ శాఖ : మేడారం అదే విదంగా మేడారం పరిసర గ్రామాల్లో రూ. 4కోట్ల వ్యయంతో రోడ్ల మరమ్మతులు, తాగునీరు, సోలార్ లైట్లు, భవన నిర్మాణ, మరమ్మతులు పనులు చేపట్టారు. మూడు శాశ్వత షెడ్ల నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.

ఆర్ డబ్ల్యుఎస్ : ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ ద్వారా రూ.13 కోట్ల 50 లక్షలతో వివిధ పనులు చేపట్టారు. త్రాగునీటి కొరకు దాదాపు రూ. 6 కోట్లు వెచ్చించారు. 17 ఇన్ ఫిల్టరేషన్ బావులు, 495 ప్రాంతాల్లో 5000 నల్లాలు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, 40 జనరేటర్లు, 1800 కె ఎల్ సామర్ధ్యం గల 7 నీటి ట్యాంకులు చేపట్టారు. శాశ్వత మరుగుదొడ్లు అదే విదంగా 8400 తాత్కాలిక మరుగుదొడ్లు , ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేపట్టారు. మరుగుదొడ్లు క్లీనింగ్ కు 300 సిబ్బంది తో గల్ఫేర్స్ ను ఏర్పాటు చేశారు. భక్తులకు త్రాగునీరు, మరుగుదొడ్ల సమస్య పరిష్కరించేందుకు ఈ శాఖ ద్వారా తగు పనులను చేపట్టారు.

ఎండోమెంట్ శాఖ : మేడారం వచ్చే భక్తుల సౌకర్యార్థంరూ. 3కోట్లతో ఆలయాలకు పెయింటింగ్, విద్యుదీకరణ, ప్రాంగణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రత్యేక షెడ్ లు, పందిళ్లు, నిర్మాణం తదితర పనులను చేపట్టారు. ఈ ఏడాది దేవాదాయశాఖ డిజిటల్ హుండీలకు శ్రీకారం చుట్టింది. కరోన దృష్ట్యా హుండీల వద్ద భక్తులు గుమ్మికూడకుండా తల్లుల దర్శనం చేసుకొని క్యూఆర్ కోడ్ తో ఫోన్ పే, గూగుల్ పేటిఎమ్ నుంచి నగదు కానుకలు వేసే విధంగా నూతన చర్యలు చేపట్టింది. క్యూ ఆర్ కోడ్ ను పలు ప్రాంతాలలో డిస్ ప్లే చేశారు.

విద్యుత్ శాఖ : మేడారం జాతరలో నిరంతరం విద్యుత్ సరఫరాకు రూ. 4కోట్లతో పనులు చేపట్టారు. విద్యుత్ దీపాలు, 247 భారీ సామర్ధ్యం గల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న పోల్స్ కు అదనంగా విద్యుత్ స్తంభాలను, కొత్త వైర్ల, డీటీఆర్ లు, స్పెసర్లు, ఎల్టీ కేబుల్ వైర్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ అందజేస్తుంది.

రవాణా శాఖ : గ్రామీణ, దూర ప్రాంత ప్రజలకు ఆర్ టి సి ప్రధాన ఆధారం. తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం ఆర్ టి సి తోనే సాధ్యం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల భక్తుల రవాణా లక్ష్యంగా 3845 బస్సులను ప్రత్యేకంగా నడిపిస్తున్నారు. మేడారంలో 40 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల, 39 టికెట్ బుకింగ్ కౌంటర్లు, లైటింగ్, రైలింగ్ ,త్రాగునీరు తదితర ఏర్పాట్లు చేసి రవాణాకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.

అగ్నిమాపక శాఖ : అగ్ని ప్రమాదాలు సంభవించకుండా రూ.10 లక్షల నిధులతో ముందస్తు చర్యలు తీసుకున్నారు.11 అగ్నిమాపక వాహనాలు, మిస్ట్ జీపులు, మిస్ట్ బుల్లెట్ వాహనాలు సిద్ధంగా ఉంచారు.

పోలీస్ శాఖ : జాతర పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలు పరిరక్షణకు, భక్తులు సాఫీగా దర్శనం చేసేందుకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. మేడారం ఆలయ ప్రాంగణం, ఆర్టీసీ బస్ స్టాండ్, జంపన్నవాగు, పార్కింగ్, అన్ని ప్రధాన సెక్టార్లతో పాటు పలు ప్రాంతాలలో బారి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన పోలీస్ క్యాంపులతో పాటు మినీ పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు 12 వేల పోలీస్ సిబ్బంది సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జాతర పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు.

వైద్య శాఖ : భక్తుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రూ.1.50 కోట్ల నిధులతో మేడారం కల్యాణ మండపంలో 25 మంది వైద్య నిపుణులు, 120 మంది వైద్య అధికారులు, 857 పారామెడికల్ సిబ్బంది తో 50 పడకల ఆసుపత్రి నెలకొల్పారు. పరిసర ప్రాంతాల్లో 75 ప్రత్యేక వైద్య శిబిరాలు అదే విధంగా తాడ్వాయిలో 10 పడకలు, పస్రాలో 5 శిబిరాలు ఏర్పాటు చేశారు. కరోన దృష్ట్యా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 11 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారు. అంతే కాకుండా క్యూ లైన్ల వద్ద మినీ క్యాంపులు ఏర్పాటు చేశారు. 10 లక్షల మాస్కులు పంపిణీ చేయనున్నారు.

పర్యాటక శాఖ : మేడారం వచ్చే వారికి అన్ని సదుపాయాలతో టెంటెడ్ ఆకామిడేషన్లు, అలాగే భక్తులకు హరిత రెస్టారెంటును సిద్ధం చేశారు. అదే విధంగా హెలికాఫ్టర్ ప్రయాణం, ప్యారా సెయిలింగ్, హాట్ ఎయిర్ బెలూన్ సేవలను ప్రైవేట్ సంస్థ ద్వారా అందిస్తోంది.

ఆహార భద్రత శాఖ : జాతరలో ఆహార నాణ్యతను పరీక్షించేందుకు మొబైల్ టెస్టింగ్ మెషీన్ ను ఏర్పాటు చేసి ఎక్సైజ్ అధికారులతో బృందాలగా ఏర్పాటు చేసి రెండు షిఫ్టులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మత్స్యశాఖ : జంపన్న వాగు ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూ.17.38 లక్షల నిధులతో ముందస్తుగా 250 మంది గజ ఈతగాళ్లను, తెప్పలను సెర్చ్ లైట్లను అందుబాటులో ఉంచారు.

సమాచార శాఖ : జాతరను ప్రపంచ వ్యాప్తంగా కళ్ళకి కట్టినట్టు చూపించడానికి మీడియా పగలు రాత్రి శ్రమిస్తోంది. సమాచార పొరసంబంధాల శాఖ ద్వారా మీడియాకి అవసరనైన ఏర్పాట్లు చేసింది. మీడియా సెంటర్ ఏర్పాటు చేసి పాత్రికేయులకు కంప్యూటర్లు, నెట్ సదుపాయాలు కలిపించారు. అదే విధంగా గత జాతర ఫోటోలతో ఛాయాచిత్ర ప్రదర్శన, అలాగే కళాకారులకు చేయూత అందించడంలో భాగంగా పరిసర ప్రాంతాలలో గ్రామీణ కళారూపాలు ప్రదర్శన ఏర్పాట్లు చేశారు.

బిఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవలు : మేడారంలో బిఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవలు అందిస్తుంది. 20 వై ఫై హాట్ స్పాట్స్ ను జాతర పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి 2G,3G,4Gసేవలను భక్తులకు అందజేస్తున్నారు.