నేడు మేడారం గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క

నేడు మేడారం గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క

నేడు మేడారం గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్కవరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతర వైభవంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు కొనసాగే ఈ మహాజాతర ఫిబ్రవరి 16 బుధవారం రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు మేడారం గద్దెలపై కొలువుదీరడంతో జాతర తొలి ఘట్టం ప్రారంభమైంది. దీంతో మంగళవారం వరకు మోస్తరుగా ఉన్న భక్తుల రద్దీ, ఒక్కసారిగా పెద్దఎత్తున పెరిగింది. మహాజాతరలో కీలక ఘట్టంగా చెప్పుకునే సమ్మక్క తల్లి నేడు రాత్రి మేడారం గద్దె వద్దకు చేరుకుంటుంది.

మేడారంకు ఈశాన్యం దిక్కున ఉన్న చిలుకల గుట్టపై నెమలినార చెట్టు కింద ఉన్న అమ్మవారి రూపమైన కుంకుమ భరిణేను సమ్మక్క పూజారాలు సాంప్రదాయ బద్దంగా మేడారం గద్దెపైకి తీసుకువస్తారు. అమ్మవారిని తీసుకువచ్చేముందు చిలుకల గుట్ట వద్ద భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికార లాంఛనాలతో పోలీసుల తుపాకుల కాల్పులు, ఎదురుకోళ్ల మధ్య అమ్మవారిని మేడారంకు తీసుకురావడంతో మేడారం జాతరలో ప్రధాన ఘట్టం మొదలవుతుంది. ఈ ప్రధాన ఘట్టాన్ని చూసేందుకు భక్తులంతా ఎగబడతారు. ఈ మహాజాతరలో సమ్మక్క రాక కోసం భక్తులంతా తన్మయత్వంతో వేయికళ్లతో ఎదురుచూస్తారు. దీంతో జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. క్యూ లైన్లన్నీ కిక్కిరిసాయి. జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవార్ల దర్శనానికి వస్తున్నారు.