పర్యాటక శాఖను ప్రారంభించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య

పర్యాటక శాఖను ప్రారంభించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య బుధవారం ప్రారంభించారు. మేడారంలోని శ్రీ సమ్మక్క,సారలమ్మ ఆదివాసీ మ్యూజియం ఆవరణలో జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పర్యాటక స్థలాలపై ఏర్పాటు చేసిన ఫోటోలను ఆయన తిలకించారు. పర్యాటకులను మంత్ర ముగ్దులను చేసే దృశ్యాలు ఈ స్టాల్ లో అనేకం ఉన్నాయన్నారు కలెక్టర్ కృష్ణ ఆదిత్య. టూరిజం శాఖ 3 రోజుల ట్రిప్ ను ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

వరంగల్ జిల్లాలోని పర్యాటక స్థలాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ చారిత్రాత్మకమైన దేవాలయంగా ములుగు జిల్లాలోని రామప్ప గుర్తింపు పొందినందున పర్యాటకులకు చక్కని విజ్ఞానంతో కూడిన వినోదం అందించగలుగుతామని అన్నారు. అదే విధంగా ఆసియాలోనే రెండవ అతి పెద్ద గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో మేళవించిన దైవసన్నిధి శ్రీ సమ్మక్క,సారలమ్మ మహాజాతరను దర్శింపచేసేందుకు ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. అనంతరం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలతో రూపొందించిన బ్రోచర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, వంశీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.