మంత్రిని ఆశ్చర్యపరిచిన స్కూల్ స్టూడెంట్స్

మంత్రిని ఆశ్చర్యపరిచిన స్కూల్ స్టూడెంట్స్వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఎం కెసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి రాయపర్తిలో ఆగారు. ఈ సందర్భంగా మంత్రి ముందుగా పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడారు. స్కూల్ లో అందిస్తున్న విద్యా బోధన, భోజన వసతి, హాస్టల్ సదుపాయాలు ఎలా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లికి విద్యార్థులు పలు ప్రభుత్వ పథకాల వివరాలను చెబుతూ ఆశ్చర్య పరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మంత్రికి వివరించారు. దీంతో మంత్రి వారిని అభినందించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి బోధన అందించాలని, ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తేవాలని చెప్పారు. విద్యార్థులు కూడా విద్యా బుద్ధులు నేర్చుకొని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లితండ్రులు, ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలని ఆయన కోరారు.