వడ్ల సేకరణలో దేశమంతా ఒకే పాలసి ఉండాలి : సీఎం

వడ్ల సేకరణలో దేశమంతా ఒకే పాలసి ఉండాలి : సీఎం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఆహార ధాన్యాల సేకరణలో దేశమంతా ఒకే పాలసీ ఉండాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సుదీర్ఘమైన చర్చ తర్వాత రాష్ట్రంలో పండిన పండబోయే యాసంగి వరి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్రంలో కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించామన్నారు.

వడ్ల సేకరణలో దేశమంతా ఒకే పాలసి ఉండాలి : సీఎంరేపు మంత్రుల బృందం, ఎంపీలు పార్లమెంట్ కు వెళ్లి, ఆహార మంత్రిని తెలంగాణ రైతుల పక్షాన కలుస్తారు. కేంద్రం సూచన మేరకు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచన మేరకు రైతులు పంటల మార్పిడి చేశారు. గతంలో 55 లక్షల ఎకరాల్లో వరి పంట ఉండేదని, ఇప్పుడు 35 లక్షల ఎకరాల్లో ఉందన్నారు. దీంట్లో 3 లక్షల ఎకరాల్లో సీడ్ కోసం వరిని ఉత్పత్తి చేశారు. మరొక రెండున్నర లక్షల ఎకరాల్లో తినడానికి వాడుకుంటారు. 30 లక్షల ఎకరాల్లో పండించిన వరి అమ్మాల్సి ఉంటుంది. పంట మార్పిడి కింద వరి ఉత్పత్తిని తగ్గించగల్గామని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆహార రంగంలో అన్ని దేశాలు కూడా స్వావలంబన ఉండాలని కోరుకుంటాయి. భారతదేశంలో కూడా ఫుడ్ సెక్టార్ ముఖ్యమైంది కాబట్టి, ప్రపంచ జనాభాలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో దేశంలో ఆహార కొరత రాకుండా ఉండేందుకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చారు. ఈక్రమంలో కేంద్రం ధాన్యం సేకరించి, నిల్వ చేయాలి. కొన్ని సందర్బాల్లో ఒక వేళ ఎక్కువ పంట మొత్తంలో వస్తే, కేంద్రమే భరించి సేకరించాలి. ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదు అని సీఎం కేసీఆర్ అన్నారు. దీనిపై కేంద్రాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

వన్ నేషన్ వన్ రేషన్ మాదిరిగానే వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతా ఒకే పాలసీ ఉండాలి. పంజాబ్ కు ఒక నీతి, గుజరాత్ కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి ఉండదు. ఇది రైతుల యొక్క జీవన్మరణ సమస్య, ఆ పంట సేకరించే విషయంలో ఇబ్బంది పెట్టొద్దు. కొన్ని రాష్ట్రాలు ఉద్యమించాయి కాబట్టి, 100 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశామని కేసీఆర్ గుర్తు చేశారు.

కేంద్రం సాయం లేకపోయినా, కొత్త రాష్ట్రమైనప్పటికీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి, భూగర్భ జలాలు పెంచుకుని మంచి ఉత్పత్తులు సాధిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రైతుల ముఖాల్లో వెలుగులు వచ్చాయి. ఆత్మహత్యలు తగ్గాయి. ప్రశాతం వాతావరణం ఉంది. ఈక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాసంగి కాలంలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని సీఎం అన్నారు. కనీస మద్దతు ధర నిర్ణయించేది బియ్యానికి కాదు, వరి ధాన్యానికి అని పేర్కొన్నారు. ఎంఎస్పీ ప్రకారమే పంజాబ్ లో సేకరిస్తున్నారు. ఇదే పద్ధతిలో మా వడ్లను కూడా కొనాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.