చిన్న జీయర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న గిరిజనులు

చిన్న జీయర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న గిరిజనులు

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలపై చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. చరిత్రలేని వనదేవతలు అంటూ ఆదివాసీల దేవతలపై విమర్శలు చేసిన చిన్న జీయర్ స్వామి వీడియో వివాదంగా మారింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు ఖండిస్తూ ములుగు జిల్లాలో ఆదివాసీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.చిన్న జీయర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న గిరిజనులుఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మకు చెప్పుల దండతో ఊరేగించి, దహనం చేశారు. వనదేవతలను కించపరిచేలా, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే చిన్న జీయర్ స్వామి ముక్కు నేలకు రాసి, సమ్మక్క, సారలమ్మ దేవస్థానానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదివాసి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి చిన్న జీయర్ స్వామిపై చర్యలు తీసుకోవాలని లేదంటే, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అన్ని ఆదివాసి సంఘాలు, కుల సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.