కేంద్రమంత్రులవి పచ్చి అబద్ధాలు : మంత్రి సత్యవతి

కేంద్రమంత్రులవి పచ్చి అబద్ధాలు : మంత్రి సత్యవతి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవిలు విమర్శించారు. లోక్ సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ, తెలంగాణలోని అంగన్ వాడీ కేంద్రాలకు కేంద్రం ఫోర్టిఫైడ్ బియ్యం, గోధుమలు ఇస్తున్నామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించడం లేదని చెప్పడంపై వారు తీవ్రంగా ఆక్షేపించారు. ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. ఒక బాధ్యతగల మంత్రిగా కొనసాగుతూ, పచ్చి అబద్ధాలు మట్లాడటం శోచనీయమని వ్యాఖ్యానించారు.కేంద్రమంత్రులవి పచ్చి అబద్ధాలు : మంత్రి సత్యవతితెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఆమె మాట్లాడారని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న గోధుమలు అంగన్ వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఇవ్వడం లేదన్నది పూర్తిగా అవాస్తమని అన్నారు. రాష్ట్రంలో గోధుమలు ఎప్పుడు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదని, ఇప్పుడు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. కేంద్రం ఇచ్చిన గోధుమలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం చక్కెర, నూనె, పాల పౌడర్, పప్పు ధాన్యాలను అదనంగా కలిపి తయారు చేసిన బాలామృతం మాత్రమే ఇస్తున్నామని వారు స్పష్టం చేశారు. తెలంగాణ మహిళా, శిశుసంక్షేమ శాఖ అమలు చేస్తున్న గ్రోత్ మానిటరింగ్ పథకం చాలా బాగుంది. దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ఈ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్వయంగా మేము వెళ్లినప్పుడు మెచ్చుకుని, నేడు ఈ పార్టీని, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాత్రమే పార్లమెంటులో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. నిజంగా కేంద్రం ఇస్తున్నది రాష్ట్రం చేయకపోతే ఏదైనా సలహాలు ఇవ్వాలి కానీ అబద్దాలు చెప్పడం సరైంది కాదన్నారు.

ఫోర్టిఫైడ్ బియ్యంపై అడిగిన వారికి అవగాహన లేదు. సమాధానం చెప్పిన వారికి చిత్తశుద్ది లేదని విమర్శించారు.జ గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహార లోపం ఉంది అని ఒక సర్వేలో తేలితే, దానిని అధిగమించేందుకు ఫోర్టిఫైడ్ బియ్యం అందించాలని కేంద్రం చెప్పింది. వారు చెప్పిన దానికి జాతీయ పోషకాహార సంస్థ, ఇక్రిశాట్ సంస్థలతో కలిసి నాణ్యమైన పోషకాహార ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేసి తెలంగాణలో అంగన్ వాడీకేంద్రాల ద్వారా ఇస్తున్నాం. దీంతో పాటు మిల్లెట్స్ కూడా అందిస్తున్నాం. రాష్ట్రంలో చాలామంది మహిళల్లో రక్త హీనత ఉన్నదని, వారికి అదనపు పోషకాహారం ఇవ్వాలని అడిగితే కేవలం రెండు జిల్లాలకు మాత్రమే ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. కానీ సీఎం కేసిఆర్ వాళ్లను, వీళ్లను అడగడం దేనికి మనమే ఇద్దామని చెప్పి 9 జిల్లాలకు కేసిఆర్ న్యూట్రిషన్ కిట్ కింద ఇవ్వాలని నిర్ణయించాము. ఇందుకు సీఎం కేసిఆర్కి ధన్యవాదాలు తెల్పుతున్నామని అన్నారు.

ఫోర్టిఫైడ్ బియ్యం గత నాలుగు నెలల నుంచి అందిస్తున్నాం అని పార్లమెంట్ లో ప్రశ్న అడిగిన వారికి, అక్కడ సమాధానం చెప్పిన వారికి కూడా చెప్తున్నాం. పార్లమెంటును పక్క దోవ పట్టించి 24 లక్షల మంది గర్భిణీలు, పిల్లలను అనుమానపర్చి, ఆందోళన చేసే విధంగా కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ మాట్లాడారు.సమాచార లోపం, అవగాహన రాహిత్యంతో కేంద్ర మంత్రులు మాట్లాడడం మంచిది కాదు. కేంద్రం అంగన్వాడీల గౌరవ వేతనం కోసం కేవలం వారి వాటాగా రూ.2700 ఇస్తుంటే మనం రూ. 10,950 కలిపి దేశంలో ఎక్కడా లేనివిధంగా 13,650 రూపాయల గౌరవ వేతనం అందిస్తున్నామని అన్నారు. అంగన్వాడీల గౌరవ వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గింది. బాలామృతం తయారీలో గోధుమలు మాత్రమే ఇస్తున్నారు. కానీ చక్కెర, నూనె, పాలపౌడర్, ఇతర సామగ్రి అంతా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. మేము కేంద్ర మంత్రులను కలిసి అడిగినప్పుడు ఒక రకంగా, పార్లమెంట్ లో సభ్యులకు సమాధానం మరో రకంగా చెప్పడం మంచిది కాదు.

కోవిడ్ సమయంలో ప్నాణాలు పణంగా పెట్టి పనిచేసిన ఆరోగ్య కార్యకర్తల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకంకింద బీమా అమలు చేస్తున్నామని ప్రకటిస్తే..కోవిడ్ సమయంలో అంగన్వాడీలు కూడా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారని, కొంతమంది ప్రాణాలు కోల్పోయారని, వారికి కూడా ఈ బీమా పథకం వర్తింపచేయాలని నేను కేంద్ర మంత్రిని స్వయంగా కోరితే..దానిని పరిశీలించి త్వరలోనే శుభవార్త చెప్తాం అని సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పుడు కేంద్రం అంగన్వాడీలకు ఈబీమా వర్తింపజేసేందుకు సుముఖంగా ఉంది.. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ వల్ల చనిపోయిన వారి సమాచారం ఇవ్వడం లేదు అని తప్పుడు సమాచారం చెబుతున్నారు. కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు మొదట్లోనే కేంద్రానికి ఇచ్చినా అబద్దాలు చెప్పి పార్లమెంటును తప్పు దోవ పట్టించారు.

రాష్ట్ర మంత్రిగా నేను రెండు శాఖలు నిర్వహిస్తున్నాను. కోవిడ్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ పెడితే గిరిజన సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి అర్జున్ ముండా రెండు, మూడు సార్లు గిరిజనుల సంక్షేమ గురించి మాట్లాడారు. కానీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రిగా మహిళల గురించి ఏ ఒక్క రోజు శ్రీమతి స్మృతి ఇరానీగారు మాట్లాడలేదు. ఏ ఒక్క రోజు మహిళల యోగ క్షేమాలు అడగలేదు. మేము చేస్తున్నవి కనీసం అభినందించలేదు. కాబట్టి నేడు మహిళల గురించి మాట్లాడుతున్న వారి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.

అంగన్వాడీలు బాగా కష్టపడుతున్నారు వారికి వేతనాలు పెంచండి అని కేంద్రాన్ని కోరితే, వారితో పని తీసుకోకండి. పని తీసుకొమ్మని మేము చెప్పడం లేదు కాబట్టి వేతనాలు పెంచమని మమ్మల్ని అడుగొద్దు అని నిర్ధాక్షిణ్యంగా చెప్పిన గొప్ప ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో ఉంది. నిజంగా మహిళలపై ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే వారి వేతనాలు పెంచాలని మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ఉన్నట్లు కేంద్రం వాటాను 90 శాతానికి పెంచాలి అని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా పార్లమెంటులో పచ్చి అబద్దాలు చెబుతున్న మంత్రులు క్షమాపణ చెప్పి, వారి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.